అర్నబ్ తుఫాను ఎఫెక్ట్.. 5.7 లక్షల మందిని తరలించేందుకు ఏపీ సర్కార్ సన్నాహాలు

Cyclone Arnab: బంగాళాఖాతంలో ఏర్పడిన 'అర్నాబ్' తుఫాన్ తూర్పు తీరం వైపునకు దూసుకొస్తోంది. రాబోయే అక్టోబర్ 28, బుధవారం నాడు ఈ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

G Krishna
Published on: 26 Oct 2026 6:22 PM IST
Cyclone Arnab
X

అర్నబ్ తుఫాను ఎఫెక్ట్.. 5.7 లక్షల మందిని తరలించేందుకు ఏపీ సర్కార్ సన్నాహాలు

Cyclone Arnab Andhra Pradesh: బంగాళాఖాతంలో ఏర్పడిన 'అర్నాబ్' తుఫాన్ తూర్పు తీరం వైపునకు దూసుకొస్తోంది. రాబోయే అక్టోబర్ 28, బుధవారం నాడు ఈ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో గంటకు ఏకంగా 140 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీయడంతోపాటు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాన్ ముప్పును ముందే గ్రహించిన ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ప్రాణనష్టాన్ని నివారించేందుకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు, సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు ప్రక్రియను చేపట్టేందుకు రంగం సిద్ధం చేశాయి.

తీరం దాటే ముందు మరింత బలపడనున్న తుఫాన్

భారతీయ వాతావరణ శాఖ (IMD) అంచనా ప్రకారం.. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం మరింత బలపడి బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటనుంది. ఈ తుఫాన్ ప్రభావం ఏపీలోని ఉత్తర, మధ్య తీర ప్రాంతాలతో పాటు పొరుగునే ఉన్న దక్షిణ ఒడిశా మీద కూడా తీవ్రంగా ఉండనుంది. ఈ ప్రాంతాల్లో కుంభవర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. సముద్రం అల్లకల్లోలంగా మారనున్న నేపథ్యంలో, వేటకు వెళ్లిన మత్స్యకారులందరూ ఇప్పటికే సురక్షితంగా ఒడ్డుకు చేరుకోవాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. తుఫాన్ కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే ప్రాంతాల్లో పునరుద్ధరణ చర్యల కోసం ప్రత్యేక బృగాలను సిద్ధం చేశారు.

ఏపీలో 5.7 లక్షల మంది గుర్తింపు.. ఒడిశాలో విద్యాసంస్థలు బంద్

ప్రమాదకర ప్రాంతాల్లో నివసిస్తున్న సుమారు 5.7 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అధికారుల ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం నుంచే తరలింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. మరోవైపు, ఒడిశా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఐదు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో పాఠశాలలు, కళాశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల ప్రజల కోసం ప్రత్యేకంగా తుఫాన్ ఆశ్రయాలను (Cyclone Shelters) సిద్ధం చేస్తున్నారు.

పశ్చిమ బెంగాల్‌పై కూడా తుఫాన్ ప్రభావం

అర్నాబ్ తుఫాన్ తీవ్రత కేవలం ఏపీ, ఒడిశాలకే పరిమితం కాకుండా పశ్చిమ బెంగాల్‌పై కూడా ప్రభావం చూపనుంది. అక్టోబర్ 27 నుంచి 30 మధ్య కోల్‌కతా, హౌరా, హుగ్లీ, ఝార్‌గ్రామ్, ఉత్తర , దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా అక్టోబర్ 28 నుంచి 30 వరకు దక్షిణ 24 పరగణాలు, మేదినీపూర్, ఝర్‌గ్రామ్, బంకురా తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. అలాగే డార్జిలింగ్, కాలింపాంగ్, అలీపుర్‌దువార్ జిల్లాల్లో అక్టోబర్ 29, 30 తేదీల్లో భారీ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉంది. అక్టోబర్ 27 నుంచి 29 మధ్య బెంగాల్ తీర ప్రాంతంలో గంటకు 35 నుంచి 45 కి.మీ వేగంతో (గరిష్టంగా 55 కి.మీ) ఈదురు గాలులు వీయనున్నాయి. ఈ నేపథ్యంలో తుఫాన్ ప్రభావం ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక వాతావరణ హెచ్చరికలను విధిగా పాటించాలని అధికారులు కోరుతున్నారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.