Akvan Cyclone: బంగాళాఖాతంలో కల్లోలం.. ఏపీ వైపు దూసుకొస్తున్న అక్వాన్ తుఫాను..ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్!
Akvan Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుఫాను అతి తీవ్ర తుఫానుగా బలపడి శుక్రవారం మధ్యాహ్నం నెల్లూరు - విశాఖపట్నం మధ్య తీరం దాటనుంది.
Akvan Cyclone: బంగాళాఖాతంలో కల్లోలం.. ఏపీ వైపు దూసుకొస్తున్న అక్వాన్ తుఫాను..ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్!
weather alert: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అక్వాన్’ తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరంపై పెను ప్రభావం చూపేందుకు సిద్ధమవుతోంది. గంటగంటకూ బలం పుంజుకుంటూ తీరం వైపు దూసుకొస్తున్న ఈ తుఫాను, రానున్న రోజుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల వాతావరణాన్ని పూర్తిగా మార్చివేయనుంది.
గడిచిన ఆరు గంటలుగా గంటకు 3 కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా కదులుతున్న అక్వాన్ తుఫాను, ప్రస్తుతం చెన్నైకి 590 కిలోమీటర్లు, మచిలీపట్నం, విశాఖపట్నానికి 620 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 750 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణిస్తున్న ఈ తుఫాను నేటి ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి, రేపు సాయంత్రానికి మరింత బలపడి అతి తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, శుక్రవారం మధ్యాహ్నం సమయంలో నెల్లూరు - విశాఖపట్నం మధ్య అక్వాన్ తుఫాను తీరాన్ని దాటనుంది. తీరం దాటే సమయంలో పెను ప్రమాదం పొంచి ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. కొన్ని సందర్భాల్లో గాలుల వేగం గరిష్టంగా గంటకు 145 కిలోమీటర్లకు చేరుకునే ప్రమాదం ఉంది.
తుఫాను ప్రభావంతో గురువారం, శుక్రవారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా తీరప్రాంత జిల్లాల్లో దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు, మత్స్యకారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. అలాగే, చేతికొచ్చిన పంటలు దెబ్బతినకుండా రైతులు తమ వ్యవసాయ పనుల విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేశారు.
అక్వాన్ తుఫాను ప్రభావం కేవలం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాకుండా పొరుగు రాష్ట్రమైన తెలంగాణపైనా పడనుంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, గురువారం మరియు శుక్రవారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది.




