Chandrababu: ఎల్‌నినో, తుపాన్ల దెబ్బతో ఏపీకి నష్టాలు.. కేంద్ర సాయం కోరిన చంద్రబాబు
Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌తో కలిసి దిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు.
Chandrababu: ఎల్‌నినో, తుపాన్ల దెబ్బతో ఏపీకి నష్టాలు.. కేంద్ర సాయం కోరిన చంద్రబాబు
Chandrababu: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి అందాల్సిన ఆర్థిక సాయం, రాయలసీమ అభివృద్ధికి కీలకమైన హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టు అంశాలపై ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు దిల్లీలో కీలక చర్చలు జరిపారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌తో కలిసి ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ఆర్థిక, అభివృద్ధి ప్రతిపాదనలను కేంద్ర మంత్రి ముందుంచారు.
భేటీ సందర్భంగా రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ఎంతగానో దోహదపడే హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టు ఆవశ్యకతను సీఎం చంద్రబాబు వివరించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసిన సమగ్ర ప్రతిపాదనలను త్వరగా కార్యరూపంలోకి తీసుకురావాలని, ఇందుకు కేంద్రం నుంచి అవసరమైన ఆర్థిక, విధానపరమైన సహకారం అందించాలని కేంద్ర మంత్రిని కోరారు.
ప్రకృతి వైపరీత్యాల వల్ల రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ముఖ్యమంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో సంభవించిన అర్నబ్, మరుసు తుపాన్ల వల్ల జరిగిన భారీ నష్టంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదికలు, వివరాలు పంపిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు.
వరుస తుపాన్లతో పాటు ఎల్‌నినో (El Nino) పరిస్థితుల కారణంగా వ్యవసాయ, ఇతర రంగాల్లో తలెత్తిన సమస్యలను ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి తక్షణమే అవసరమైన ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేశారు.




