ఇళ్ల నిర్మాణంలో ఏపీ కొత్త అడుగు.. 3D ప్రింటింగ్‌తో ఇళ్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద వర్గాల సొంతింటి కలను నూటికి నూరు శాతం నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం మరో భారీ విప్లవాత్మక అడుగు వేసింది. గుంటూరు జిల్లా తెనాలి
cm-chandrababu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద వర్గాల సొంతింటి కలను నూటికి నూరు శాతం నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం మరో భారీ విప్లవాత్మక అడుగు వేసింది. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గ పరిధిలోని బుర్రిపాలెం గ్రామం వేదికగా నూతనంగా మంజూరైన 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంయుక్తంగా శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపన మహోత్సవంతో పాటు గ్రామీణ ప్రాంత గృహ నిర్మాణ రంగంలో సరికొత్త విప్లవానికి తెరతీస్తూ '3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ' పైలట్ ప్రాజెక్ట్‌కు కూడా ఇరువురు నేతలు అధికారికంగా శ్రీకారం చుట్టారు.
PMAY-G 2.0 కింద 3 లక్షల ఇళ్ల కేటాయింపు
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (PMAY-G) 2.0 పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 లక్షల గృహాలను మంజూరు చేసింది. పేద కుటుంబాలకు నాణ్యమైన ఇళ్లను సత్వరమే అందించి, గ్రామీణ ప్రాంత రూపురేఖలను మార్చడమే లక్ష్యంగా ఈ పనులకు బుర్రిపాలెం నుంచి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రికార్డు స్థాయిలో 5.50 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించనుంది. గత ఏడాది నవంబర్‌లో 3 లక్షల ఇళ్లకు, ఈ ఏడాది మార్చిలో మరో 2.50 లక్షల ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మరో 4.20 లక్షల ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో పురోగతిలో ఉండగా, వీటిని వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు యంత్రాంగం వేగంగా అడుగులు వేస్తోంది.
రోబోటిక్స్ వేగంతో '3D కాంక్రీట్ ప్రింటింగ్' ఇళ్లు
ఈ కార్యక్రమంలో అందరినీ ఆకట్టుకున్న ప్రధాన అంశం ‘3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ’. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అత్యంత వేగంగా, దృఢమైన ఇళ్లను నిర్మించేందుకు బుర్రిపాలెం, ఒబులనాయుడుపాలెం గ్రామాల్లో 175 ఇళ్లతో ప్రత్యేక పైలట్ ప్రాజెక్ట్ చేపట్టారు. సుమారు రూ.14 కోట్ల (పన్నులతో కలిపి) అంచనా వ్యయంతో ఈ ప్రయోగాత్మక నిర్మాణాలు సాగనున్నాయి. ఈ పైలట్ ప్రాజెక్టులో భాగంగా సాధారణ లబ్ధిదారుల కోసం 100 ఇళ్లను 25 చదరపు మీటర్ల విస్తీర్ణంలో, దివ్యాంగుల సౌకర్యార్థం మరో 77 ఇళ్లను 32 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రత్యేక డిజైన్‌తో నిర్మించనున్నారు. ప్రతి ఇంటికి ఆధునిక మరుగుదొడ్డి సదుపాయాన్ని పొందుపరచనున్నారు.
కేంద్రం, సిఎస్ఐఆర్, ఏపీ ప్రభుత్వం ముక్కోణపు భాగస్వామ్యం
ఈ ప్రతిష్టాత్మక 3D టెక్నాలజీ ప్రాజెక్ట్‌ను కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ప్రసిద్ధ పరిశోధనా సంస్థ CSIR-CBRI (రూర్కీ) , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా అమలు చేస్తున్నాయి. 3D ప్రింటింగ్ యంత్రాల కొనుగోలు, డిజైన్ పర్యవేక్షణ , నిర్మాణ వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్య పద్ధతిలో భరిస్తున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో అతి తక్కువ సమయంలో, నాణ్యతా ప్రమాణాలు దెబ్బతినకుండా ఇళ్లను ఎలా నిర్మించవచ్చో అంచనా వేసేందుకు ఈ ప్రయోగం దోహదపడనుంది. బుర్రిపాలెంలో చేపడుతున్న ఈ పైలట్ ప్రాజెక్ట్ గనక విజయవంతమైతే, రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలన్నింటిలో ఈ 3D ప్రింటింగ్ విధానాన్ని విస్తృతంగా అమలు చేయడానికి అవసరమైన సాంకేతిక ప్రమాణాలను రూపుదిద్దుతారు.




