CM Chandrababu : పాసుపుస్తకాలపై చంద్రబాబు డెడ్‌లైన్.. కలెక్టర్లకు స్ట్రాంగ్ వార్నింగ్.!

G Krishna
Published on: 9 Oct 2026 2:17 PM IST
CM Chandrababu
X

CM Chandrababu

సీఎం చంద్రబాబు మార్క్ పాలన: కలెక్టర్లు, మంత్రులకు డెడ్‌లైన్ వార్నింగ్, సూపర్ సిక్స్ పథకాలపై సంచలన కామెంట్స్! ఆంధ్రప్రదేశ్‌లో పాలనా స్పీడ్‌ను మరింత పెంచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులు, మంత్రులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ ప్రక్రియను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని కఠిన ఆదేశాలిచ్చారు. ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా నర్సింగోలు గ్రామసభలో పాల్గొన్న సీఎం, కొత్తపల్లి బాలమ్మ అనే మహిళా రైతుకు స్వయంగా పట్టాదారు పాసుపుస్తకాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల 58 వేల పాసుపుస్తకాలను పంపిణీ చేశామని వెల్లడించారు.

పాసుపుస్తకాల పంపిణీకి బిగ్ టార్గెట్స్

అక్టోబర్ నెలలోనే 793 గ్రామాల్లో 4 లక్షల 58 వేల మంది రైతులకు పాసుపుస్తకాలు అందించామని, ఒక్క ప్రకాశం జిల్లాలోనే 24,116 పుస్తకాలు పంపిణీ చేసినట్లు సీఎం వివరించారు. రాబోయే నవంబర్ నుంచి మార్చి 27వ తేదీ నాటికి మరో 7,789 గ్రామాల్లో దాదాపు 51 లక్షల 91 వేల మందికి పాసుపుస్తకాలు అందజేయాల్సి ఉందని స్పష్టం చేశారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని, టార్గెట్లు పూర్తి చేయకపోతే సంబంధిత కలెక్టర్లు, శాఖాధికారులు మాత్రమే కాకుండా మంత్రులు కూడా బాధ్యత వహించాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించారు. అనుకున్న టార్గెట్ సాధించే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

1995 నాటి స్పీడ్ కంటే ఇప్పుడు మరింత వేగం

నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన పనితీరులో వేగం పెరిగిందని చంద్రబాబు పేర్కొన్నారు. 1995లో తనకున్న పాలనా వేగం కంటే ఇప్పుడు మరింత స్పీడ్‌గా పనిచేస్తున్నానని, ఈ మార్పును ప్రజలు స్వయంగా గమనిస్తున్నారని అన్నారు. నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడమే తమ ప్రభుత్వ ధ్యేయమని, అందుకోసమే 'సూపర్ సిక్స్' హామీలను పక్కాగా అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 63 లక్షల మందికి ప్రతి నెలా ఒకటో తేదీనే ఇళ్ల వద్దకే వెళ్లి పించన్లు అందిస్తున్నామని తెలిపారు. అర్హతను బట్టి రూ.4,000 నుంచి రూ.15,000 వరకు ఇస్తున్నామని, ఒక్క పైసా అవినీతి లేకుండా పారదర్శకంగా పంపిణీ జరిగేలా చూడటానికే తాను స్వయంగా రంగంలోకి దిగుతున్నానని వివరించారు.

మహిళలు, పిల్లల సంక్షేమానికి పెద్దపీట

మహిళలు, పిల్లల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. 'తల్లికి వందనం' ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఒక్కొక్కరికి రూ.15,000 చొప్పున నేరుగా ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. నిబంధనల ప్రకారమే అర్హులందరికీ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించామని, ఇప్పటివరకు ఈ పథకం ద్వారా ఉచితంగా 100 కోట్ల ప్రయాణాలు పూర్తయ్యాయని హర్షం వ్యక్తం చేశారు. పేదలకు సంక్షేమం, మహిళలకు సాధికారత, రైతులకు హక్కుల కల్పనే ధ్యేయంగా తమ ప్రభుత్వం వేగంగా ముందుకెళ్తుందని సీఎం ఉద్ఘాటించారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.