CM Chandrababu: కడపలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.. ఇదే నా 4.0.!
CM Chandrababu: వైఎస్‌ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు వేదికగా జరిగిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఎస్‌ఆర్‌సీపీ.
CM Chandrababu: కడపలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.. ఇదే నా 4.0.!
CM Chandrababu: వైఎస్‌ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు వేదికగా జరిగిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఎస్‌ఆర్‌సీపీ ప్రాతినిధ్యాన్ని తీవ్రస్థాయిలో ప్రశ్నిస్తూ ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డిని 86 ఏళ్ల వయసులో కూడా నవ యువకుడిలా శ్రమిస్తున్నారని కొనియాడిన సీఎం, ఐదేళ్ల క్రితం రాష్ట్రాన్ని వేధించిన 'గొడ్డలి పార్టీ'ని ప్రజలు 57 శాతం భారీ ఓటింగ్ సాధించి భూస్థాపితం చేశారని గుర్తుచేశారు.
ప్రజలు ఇచ్చిన ఈ భారీ మద్దతుతోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 28 నెలల్లోనే రాష్ట్ర పునర్నిర్మాణానికి, తాగునీటి కష్టాల పరిష్కారానికి బలమైన పునాదులు వేసిందని స్పష్టం చేశారు. నేడు తాను, తన మిత్రుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేవలం ఏడు రోజుల్లోనే తొమ్మిది రకాల బృహత్తర సంక్షేమ కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకువచ్చామని వెల్లడించారు.
రూ.30 వేల కోట్ల జల్ జీవన్ మిషన్.. తాగునీటి కోసం 'పొట్టి శ్రీరాములు' స్మరణ
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికీ తాగునీటిని అందించే లక్ష్యంతో రూ.30,000 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న 'జల్ జీవన్ మిషన్' శిలాఫలకాన్ని ప్రారంభించినట్లు చంద్రబాబు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రతిఒక్కరూ మంచినీరు తాగిన ప్రతిసారీ అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తుచేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ పథకాలకు ఆ మహనీయుని పేరును జోడించినట్లు వెల్లడించారు.
2019లోనే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతి ఇంటికీ నీరు అందించాలని జల్ జీవన్ మిషన్‌ను తీసుకొస్తే, గత గొడ్డలి ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం రూ.2,600 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని, దీనిపై సమాధానం చెప్పే ధైర్యం ఆ పార్టీకి ఉందా అని కడప గడ్డపై నుంచి చంద్రబాబు సవాల్ విసిరారు. నాటి రహదారుల దుస్థితి, నేటి అభివృద్ధిని ప్రజలు గమనించాలని కోరారు.
రాయలసీమను 'రతనాల సీమ'గా మారుస్తాం: పోలవరం, హార్టికల్చర్ హబ్ అప్‌డేట్స్
ఒకప్పుడు కరువు సీమగా మారిన రాయలసీమను కూటమి ప్రభుత్వం హయాంలో నిజమైన 'రతనాల సీమ'గా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. మదనపల్లెలో రూ.లక్ష కోట్లతో బృహత్తర హార్టికల్చర్ హబ్‌కు పునాదులు వేశామని, ఇది సీమ రూపురేఖలను మార్చేస్తుందని చెప్పారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం ద్వారా ప్రతి ఎకరాకూ నీరిచ్చి జలహారతి ఇస్తానన్నారు.
గోదావరి పుష్కరాలకంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇక రాష్ట్ర సాంకేతిక పురోగతిలో భాగంగా అమరావతిలో 'పాన్ ఐఐటీ బోర్డు కౌన్సిల్'ను ఏర్పాటు చేశామని, ప్రతి ఇంటికీ సోలార్, ప్రతి పౌరుడికీ సెల్ ఫోన్ ద్వారా వాట్సాప్ వేదికగా ప్రభుత్వ సేవలను ఇంటి వద్దకే అందిస్తామని తెలిపారు. "ప్రపంచంలోనే అతిపెద్ద డీబీటీ (DBT) ద్వారా సంక్షేమాన్ని అందించి సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ చేశాం" అని స్పష్టం చేశారు.
లిక్కర్ స్కామ్, హత్య రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు: 'నేను చంద్రబాబు 4.0!'
విపక్ష నాయకులను ఉద్దేశించి మాట్లాడిన సీఎం చంద్రబాబు.. "నేను కూడా రాయలసీమ బిడ్డనే, ఇక్కడే పుట్టి ఈ నేల నీరు తాగి పెరిగాను" అని గుర్తుచేశారు. వివేకా హత్య నుంచి వేల కోట్ల లిక్కర్ స్కామ్ వరకు అన్నీ గొడ్డలి పార్టీ కనుసన్నల్లోనే జరిగాయని ఆరోపించారు. "రూ.40 కోట్ల సుపారీ దందాలు, లిక్కర్ స్కామ్‌లో వేల కోట్లు దోచుకున్న అంతిమ లబ్ధిదారు ఎవరో స్పష్టంగా తేలిపోయింది.
దోచుకున్న ప్రతి రూపాయిని కక్కిచడమే ఈ కూటమి ప్రభుత్వ లక్ష్యం" అని వ్యాఖ్యానించారు. తామే నేరాలు, మోసాలు చేసి ఇతరులపై నెట్టేయడం గొడ్డలి పార్టీ సిద్ధాంతమని, నేరపూరిత రాజకీయాలకు రాష్టంలో స్థానం లేదని హెచ్చరించారు. "నేను చంద్రబాబు 4.0.. మీ పాత ఆటలు, హింసా రాజకీయాలు నా దగ్గర సాగవు" అని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. చివరగా, కడప జిల్లాలోని పలువురు అధికారులు ప్రజలకు సేవ చేయడంలో వెనకడుగు వేస్తున్నారని, వారు తమ పనితీరును తక్షణమే మెరుగుపరుచుకోవాలని తీవ్రంగా ఆదేశించారు.




