CM Chandrababu: చంద్రబాబు కీలక ఆదేశాలు.. తుఫాన్ వేళ ప్రాణాలే ముఖ్యం.!
CM Chandrababu: బంగాళాఖాతంలో ముంచుకొస్తున్న తీవ్ర తుఫాన్ 'అర్నాబ్' (Arnab) ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేసింది.
CM Chandrababu: చంద్రబాబు కీలక ఆదేశాలు.. తుఫాన్ వేళ ప్రాణాలే ముఖ్యం.!
CM Chandrababu: బంగాళాఖాతంలో ముంచుకొస్తున్న తీవ్ర తుఫాన్ 'అర్నాబ్' (Arnab) ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేసింది. అమరావతి నుంచి సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేస్తున్నారు. తుఫాన్ గమనం, వేగం మారుతున్న తీరును నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ప్రజల ప్రాణాలకు ఎటువంటి ముప్పు వాటిల్లకుండా చూడటమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని సీఎం స్పష్టం చేశారు.
తీరం దాటనున్న 'అర్నాబ్'.. భారీ వర్షాలు, తీవ్ర గాల్లుల హెచ్చరిక
ప్రస్తుతం గంటకు సుమారు 24 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ తుఫాన్ ప్రభావం ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పలు ప్రాంతాలపై ఎక్కువగా ఉండనుంది. రేపు ఉదయం కాకినాడ - యానం మధ్యలో 'అర్నాబ్' తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో తీర ప్రాంతాల్లో గంటకు 140 నుండి 160 కిలోమీటర్ల వేగంతో (కొన్ని ప్రాంతాలలో ఏకంగా 180 కిమీ వరకు) భీకరమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని సీఎం తెలిపారు. ముఖ్యంగా కోనసీమ, కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, ఏలూరు, అనకాపల్లి, విశాఖపట్నం, శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళంలో సుమారు 30 సెం.మీ వరకు వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయి.
నిరంతరం అప్రమత్తంగా ఉండాలి.. ప్రజలకు సీఎం విజ్ఞప్తి
వెస్ట్ గోదావరి నుంచి శ్రీకాకుళం వరకు తీర ప్రాంత ప్రజలు, లంక గ్రామాల ప్రజలు ఎవరూ కూడా ఇళ్ల నుంచి బయటకు రావద్దని, అనవసర ప్రయాణాలను పూర్తిగా రద్దు చేసుకోవాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. సముద్ర తీర ప్రాంతాలు, ముంపు మండలాల ప్రజలు తప్పనిసరిగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు (రిహాబిలిటేషన్ సెంటర్లు) తరలివెళ్లాలని కోరారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2,199 షెల్టర్లను ఏర్పాటు చేసి, ముంపు ప్రాంతాల నుంచి సుమారు 84,396 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించారు. ఇకపై ప్రతి గంటకోసారి వాతావరణ బులెటిన్‌ను విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు..
తుఫాన్ ముఫును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. రంగంలోకి ఎన్‌డీఆర్‌ఎఫ్ (NDRF), ఎస్‌డీఆర్‌ఎఫ్ (SDRF) బృందాలను దించడంతో పాటు, వైద్య బృందాలు, 108 అంబులెన్సులు, అత్యవసర మందులు, పాము కాటు మందులు, జనరేటర్లు, తాగునీరు అందుబాటులో ఉంచారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని మొత్తం 5,153 మంది గర్భిణులను గుర్తించి, వారిని ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో నాగావళి, వంశధార నదుల ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున ఆయా రోడ్ల వద్ద అధికారులను పర్యవేక్షణకు ఉంచారు. ఒకవేళ రోడ్లు దెబ్బతింటే వెంటనే యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఉద్యానవన పంటలు, అరటి, కొబ్బరి రైతులు నష్టపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పశువులను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని సీఎం తెలిపారు.
నిత్యావసర ధరల నియంత్రణపై కూడా ప్రత్యేక సమీక్ష
తుఫాన్ సమీక్షతో పాటు రాష్ట్రంలో నిత్యావసర ధరల నియంత్రణపై కూడా సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. బియ్యం ధరల కట్టడి కోసం రైస్ మిల్లర్లు, హోల్‌సేల్ అసోసియేషన్లతో చర్చలు జరిపారు. రేషన్ షాపుల ద్వారా కిలో కందిపప్పు రూ.100, కిలో గోధుమపిండి రూ.25, లీటర్ పామాయిల్ రూ.125 చొప్పున అందించాలని నిర్ణయించారు. అలాగే ఉల్లి ధరలు మరింత తగ్గేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.




