Weather Update: ఏపీలో రాబోయే 3 రోజులు దంచికొట్టనున్న వర్షాలు.. ఆ జిల్లాలకు హైఅలర్ట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి వర్షాల ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి ఏపీ తీరం వైపునకు కదలనుంది.

CR Reddy
Published on: 31 Oct 2026 7:26 AM IST
Weather Update
X

Weather Update

Weather Update: అర్నబ్ తుఫాన్ సృష్టించిన భయం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా కోలుకోక ముందే మరోసారి భారీ వర్షాల ముప్పు వచ్చిపడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుండటంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరికలు జారీ చేసింది. అండమాన్ సముద్రం పరిసరాల్లో ఉన్న ఈ అల్పపీడనం నేడు ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడి ఏపీ తీరం వైపు పయనించే అవకాశాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

ఏపీ తీరం వైపు వాయుగుండం ప్రయాణం

రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం అల్పపీడనం తదుపరి రెండు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలకు సమీపంలోకి చేరుకోనుంది. దీని ప్రభావం వల్ల దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. సముద్రం తీవ్రంగా అల్లకల్లోలంగా మారే సూచనలు ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ఆ శాఖ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి వర్షాల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు.

జిల్లా వారీ వర్ష సూచన వివరాలు

శనివారం (అక్టోబర్ 31): మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కోనసీమ, పశ్చిమగోదావరి, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. మిగిలిన ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.

ఆదివారం (నవంబర్ 01): కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది.

సోమవారం (నవంబర్ 02): తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయి. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే వీలుంది.

శుక్రవారం నమోదు రికార్డు స్థాయి వర్షపాతం

శుక్రవారం నాటికి రాష్ట్రంలోని పలు తీరప్రాంత జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. కోనసీమ జిల్లా నగరంలో అత్యధికంగా 91.5 మిల్లీమీటర్ల వర్షం పడగా, పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 81.2 మిమీ వర్షపాతం రికార్డైంది. అలానే అనకాపల్లి జిల్లా చోడవరంలో 80.2 మిమీ, కాకినాడ జిల్లా వేలంగిలో 76.9 మిమీ, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 76.7 మిమీ వర్షం పడింది. కోనసీమ జిల్లా మామిడికుదురులో 54.2 మిమీ, అనకాపల్లి జిల్లా దేవరపల్లిలో 52.5 మిల్లీమీటర్ల చొప్పున కుండపోత వర్షం కురిసింది.

ప్రజలకు అప్రమత్తత హెచ్చరికలు

వరుస వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే ప్రమాదం ఉండటంతో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం కోరింది. విద్యుత్ స్తంభాలు, పాత భవనాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. రైతులు తమ పంట ఉత్పత్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఏ అత్యవసర పరిస్థితి వచ్చినా వెంటనే జిల్లా విపత్తు నిర్వహణ బృందాలను సంప్రదించాలని ఆదేశాలు ఇచ్చారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.