Weather Update: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. ద్రోణి ఎఫెక్ట్‌తో ఈ 10 జిల్లాల్లో వానలు

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మన్నార్ గల్ఫ్ నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని వాతావరణ నిపుణులు వెల్లడించారు.

CR Reddy
Published on: 26 Nov 2026 8:03 AM IST
Weather Update
X

Weather Update

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మన్నార్ గల్ఫ్ నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. ఈ ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే బుధవారం మధ్యాహ్నం వరకు తిరుపతి జిల్లా నాయుడుపేటలో 45.3 మిల్లీమీటర్లు, నెల్లూరు జిల్లా అల్లంపాడులో 41.5 మిల్లీమీటర్లు, గూడూరులో 32.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

నేడు ఏపీలోని 10 జిల్లాలకు వర్ష సూచన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించిన వివరాల ప్రకారం, గురువారం (నవంబర్ 26) నాడు రాష్ట్రంలోని 10 జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే సూచనలు ఉన్నాయి. పోలవరం, కోనసీమ, తూర్పుగోదావరి, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. మిగిలిన జిల్లాల్లోనూ చెదురుమదురు జల్లులు పడొచ్చు. ఇక శుక్రవారం రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కొనసాగే వీలుందని APSDMA అంచనా వేసింది.

తెలంగాణలో వానలతో పాటు పెరిగిన చలి తీవ్రత

అటు తెలంగాణలోనూ ద్రోణి ప్రభావం పాక్షికంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ, ప్రధానంగా పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింద. ముఖ్యంగా దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో ఉదయం పూట పొగమంచు కురుస్తూ చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతుండటంతో జనం ఉదయాన్నే చలికి వణికిపోతున్నారు.

పిడుగుల ముప్పు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

వర్షాలు కురిసే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా వాన పడుతున్నప్పుడు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర నిలబడకూడదని స్పష్టం చేశారు. ఈదురుగాలులు వీచే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో తిరగకుండా సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు. ప్రయాణికులు కూడా వాతావరణ పరిస్థితులను గమనిస్తూ జాగ్రత్తగా రాకపోకలు సాగించడం మంచిది.

ధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్త పడాలి

ప్రస్తుతం ఖరీఫ్ ధాన్యం కోతలు, నూర్పిళ్ల సమయం కావడంతో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు కీలక సూచనలు జారీ చేశారు. పొలాల్లో కోసిన పంటను, కల్లాల్లో ఆరబోసిన ధాన్యాన్ని వర్షానికి తడవకుండా ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని లేదా టార్పాలిన్ పట్టాలతో కప్పి ఉంచాలని కోరారు. అకాల వర్షాల వల్ల పంట నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.