AP Pensioners: ఏపీ పింఛన్ల పంపిణీపై క్లారిటీ.. కేవలం ఆ లబ్ధిదారుల ఖాతాల్లోకే నగదు జమ

AP Pensioners:ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల పంపిణీపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ పింఛన్ల పంపిణీకి అనుమతి ఇచ్చింది.

CR Reddy
Published on: 31 Oct 2026 7:37 AM IST
AP Pension
X

AP Pension

AP Pensioners: ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల పంపిణీకి సంబంధించి ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పెద్ద ఊరటనిచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ జరుగుతుందా లేదా అన్న అంశంపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరదించుతూ ఈకే కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీని యథావిధిగా కొనసాగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే దీనికి సంబంధించి కొన్ని స్పష్టమైన నిబంధనలను విధించింది.

పాత వారికి మాత్రమే నగదు పంపిణీ

ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం కేవలం ఇప్పటికే జాబితాలో ఉన్న పాత లబ్ధిదారులకు మాత్రమే పింఛన్ల సొమ్మును పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కొత్తగా ఎలాంటి లబ్ధిదారులను ఈ జాబితాలో చేర్చడానికి వీలు లేదని తేల్చిచెప్పింది. అలాగే ప్రస్తుతం అమల్లో ఉన్న పంపిణీ విధానంలో గానీ, పింఛను సొమ్ములో గానీ ఎలాంటి మార్పులు చేయకూడదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో లక్షలాది మంది వృద్ధులు, వికలాంగులు, పింఛనుదారులు ఊపిరి పీల్చుకున్నారు.

ప్రభుత్వ సిబ్బంది ద్వారానే నగదు విత్‌డ్రా, పంపిణీ

పింఛన్ల పంపిణీ ప్రక్రియలో పూర్తి పారదర్శకత ఉండాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. పింఛన్లకు అవసరమైన నిధులను సంబంధిత అధికారిక సిబ్బంది మాత్రమే బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేయాలని స్పష్టం చేసింది. ఆ ప్రభుత్వ సిబ్బంది ద్వారానే లబ్ధిదారులకు నేరుగా నగదు పంపిణీ జరగాలని తేల్చిచెప్పింది. ఈ పంపిణీ ప్రక్రియలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉండకూడదని, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పంపిణీ పూర్తి చేయాలని స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

పింఛన్ల పంపిణీ సాకుగా చూపి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా సహించేది లేదని ఎన్నికల కమిషన్ తీవ్రంగా హెచ్చరించింది. ఏ పంచాయతీ లేదా వార్డు పరిధిలోనైనా అవకతవకలు జరిగినట్లు తేలితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది. పంపిణీ సరైన రీతిలో సాగేలా చూడాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించింది.

సెర్ప్ ప్రతిపాదనకు ఆమోదం

సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (SERP) ముఖ్య కార్యనిర్వహణాధికారి (CEO) నుంచి వచ్చిన ప్రత్యేక ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయానికి వచ్చింది. పేదలకు అందించే సామాజిక భద్రతా పింఛన్లు నిలిచిపోకూడదనే ఉద్దేశంతోనే ఈ మినహాయింపు ఇచ్చినట్లు కమిషన్ తెలిపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నియమిత తేదీకి పింఛన్ల డబ్బులు లబ్ధిదారుల చేతులకు అందనున్నాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.