బంగాళాఖాతంలో అల్పపీడనం.. వాయుగుండంగా బలపడే అవకాశం..
Amaravati: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారానికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం.. వాయుగుండంగా బలపడే అవకాశం..
అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏర్పడిన ఈ అల్పపీడనం క్రమంగా బలపడే అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రానున్న రెండు రోజుల్లో దీని తీవ్రత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం వాయవ్య దిశగా కదులుతున్న అల్పపీడనం శనివారం నాటికి సుస్పష్టమైన అల్పపీడనంగా, ఆదివారం నాటికి వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ తెలిపారు.
అల్పపీడనం ప్రభావంతో అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు మారనున్నాయని పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, కొన్ని సందర్భాల్లో గాలుల వేగం గరిష్టంగా గంటకు 60 కిలోమీటర్లకు చేరవచ్చని వివరించారు. సముద్రంలో అలజడి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ముఖ్యంగా మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన వారు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అల్పపీడనం బలపడుతున్న కొద్దీ గాలుల తీవ్రత, సముద్ర పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున అధికారుల సూచనలు పాటించాలని స్పష్టం చేసింది.
అయితే ప్రస్తుతం ఏర్పడిన అల్పపీడనం ఎటువైపు పయనిస్తుంది? దాని ప్రభావం ఏయే ప్రాంతాలపై ఉంటుంది? వర్షాల తీవ్రత ఎంతవరకు ఉండవచ్చు? అనే అంశాలపై మరింత స్పష్టత రావాల్సి ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. అల్పపీడనం కదలికలు, తీవ్రతను వాతావరణ శాఖతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.
అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశాల నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతాల ప్రజలు, మత్స్యకారులు వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. తదుపరి వాతావరణ సమాచారం ఆధారంగా అవసరమైన జాగ్రత్తలపై స్పష్టత ఇవ్వనున్నట్లు తెలిపింది.




