AP local body election: బొత్స కుమార్తె బొత్స అనూష ఘోర పరాజయం..కోడలు ఘన విజయం!

AP local body election: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమి భారీ విజయం సాధించింది.

Gagan kumar
Published on: 8 Nov 2026 8:55 AM IST
AP local body election
X

AP local body election: బొత్స కుమార్తె బొత్స అనూష ఘోర పరాజయం..కోడలు ఘన విజయం!

Botsa Anusha: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి తిరుగులేని ఆధిపత్యాన్నే ప్రదర్శించింది. రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుంటూ జయభేరి మోగించింది. అయితే, ఈ ఎన్నికలు కేవలం సాధారణ పోరులా మాత్రమే కాకుండా... సీనియర్ నాయకుల వారసుల భవిష్యత్ రాజకీయాలకు పరీక్షగా మారడంతో అందరి దృష్టి వీటిపైనే పడింది. క్షేత్రస్థాయి ఫలితాలు తేలడంతో జిల్లాల్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

శ్రీ సత్యసాయి జిల్లా రాజకీయాల్లో పరిటాల కుటుంబం మరోసారి తన సత్తా చాటింది. నల్లచెరువు జడ్పీటీసీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పరిటాల శ్రీరామ్, ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థిపై తిరుగులేని మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ఈ గెలుపుతో సత్యసాయి జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే దిశగా శ్రీరామ్ అడుగులు వేగంగా పడుతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిటాల వర్గం శ్రేణుల్లో ఈ విజయం కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చక్రం తిప్పే బొత్స కుటుంబంలో స్థానిక పోరు విచిత్రమైన ఫలితాలను ఇచ్చింది. ఓవైపు ఓటమి ఎదురైతే... మరోవైపు మెజార్టీలతో విజయం దక్కింది.

వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూష ఘోర పరాజయం పాలై ఊహించని షాక్ తిన్నారు. అయితే, ఆయన కోడలు బొత్స పూజిత విజయనగరం జిల్లా గరివిడి జడ్పీటీసీ స్థానం నుంచి వైసీపీ తరఫున 1,599 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ పోరులో మాజీ మంత్రి కిమిడి కళావెంకట్రావు కోడలు కిమిడి సంధ్యపై పూజిత పైచేయి సాధించడం విశేషం. బొత్స సత్యనారాయణ సోదరి వెంకటలక్ష్మి విజయనగరం జిల్లా గుర్ల జెడ్పీటీసీ స్థానంలో 316 ఓట్ల స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. ఇటీవలే వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ గూటికి చేరిన బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీను కుటుంబంలో సంబరాలు వెల్లివిరిసాయి. మజ్జి శ్రీను కుమార్తె మజ్జి సిరిసహస్ర విజయనగరం జిల్లా తెర్లాం జెడ్పీటీసీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఏకంగా 6,651 ఓట్ల భారీ మెజార్టీతో రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకున్నారు.

విశాఖ జిల్లా రాజకీయంలో మరో వారసుడు తన ముద్ర వేశారు. మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి కుమారుడు గండి వంశీ దీప్ పొలిటికల్ ఎంట్రీలోనే సత్తా చాటారు. పెందుర్తి పరిధిలోని మొగలిపురం ఎంపీటీసీ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన వంశీ దీప్, మొదటి ప్రయత్నంలోనే ఘనవిజయం సాధించి వార్తల్లో నిలిచారు. కొందరు సీనియర్ల వారసులు తమ తండ్రుల చరిష్మా, పార్టీ వీచే పవనాలతో తొలి అడుగులోనే విజయాన్ని అందుకుంటే... మరికొందరు మాత్రం ఓటర్ల నాడిని పట్టుకోవడంలో విఫలమై వెనుకబడ్డారు. ఏది ఏమైనా, ఈ స్థానిక పోరు ఫలితాలు రాబోయే రోజుల్లో ఆయా జిల్లాల పరిషత్ చైర్మన్ పీఠాల ఎంపికలోనే కాకుండా, ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాల భవిష్యత్ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు తెరతీశాయి.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.