Diwali Gift: రేషన్ కార్డు ఉన్నవారికి దీపావళి ధమాకా.. సగం ధరకే కందిపప్పు, పామాయిల్
ఏపీలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం దీపావళి గిఫ్ట్ ప్రకటించింది. కందిపప్పు రూ.100, పామాయిల్ రూ.125, గోధుమపిండి రూ.25కే సబ్సిడీపై పంపిణీ చేయనున్నారు.
AP Ration Card
Diwali Gift: ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డు ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు కూటమి ప్రభుత్వం దీపావళి పండుగ వేళ అదిరిపోయే తీపి కబురు అందించింది. బహిరంగ మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలు మంట పుట్టిస్తున్న తరుణంలో సామాన్యుల ఇంటి బడ్జెట్ భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. దీపావళి కానుకగా రేషన్ షాపుల ద్వారా సబ్సిడీ ధరలకే నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావంతో పంట దిగుబడులు తగ్గి మార్కెట్లో రేట్లు పెరిగినందున, ప్రజలకు ఊరట కలిగించేలా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
సబ్సిడీ ధరలకే కందిపప్పు, పామాయిల్
పండుగ వేళ వంటగది అవసరాలకు ఎక్కువగా ఉపయోగపడే సరుకులను అత్యంత చవకగా అందించేందుకు ప్రభుత్వం ధరలను ఖరారు చేసింది. రేషన్ షాపుల ద్వారా కిలో కందిపప్పు రూ.100 కే అందించనున్నారు. అలాగే కిలో గోధుమ పిండి రూ.25కే లభించనుంది. మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉన్న పామాయిల్‌ను టెండర్ల ద్వారా సేకరించి లీటరు రూ.125కే ప్రజలకు పంపిణీ చేయనున్నారు. బహిరంగ మార్కెట్ ధరకు, రేషన్ సబ్సిడీ ధరకు చాలా వ్యత్యాసం ఉండటంతో పేద వర్గాలకు ఈ పండుగ వేళ వేల రూపాయల ఆదా కానుంది.
'ధరణి' బ్రాండ్ బియ్యం, ఉల్లిపాయల విక్రయం
బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం ధరలు కిలో రూ.100 దాటేయడంతో ప్రభుత్వం ప్రత్యేక కౌంటర్లు, సంచార వాహనాల ద్వారా తక్కువ ధరకు బియ్యం విక్రయిస్తోంది. 'ధరణి' బ్రాండ్ పేరుతో కిలో ఫైన్ బియ్యాన్ని రూ.49కే, సూపర్ ఫైన్ బియ్యాన్ని రూ.50కే లబ్ధిదారులకు అందిస్తున్నారు. ఇప్పటికే రైతు బజార్లలో సబ్సిడీపై బియ్యం విక్రయాలు ప్రారంభమయ్యాయి. దీనికి తోడు రైతు బజార్ల ద్వారా కిలో ఉల్లిపాయలను రూ.35కే అందిస్తుండగా, రాబోయే రోజుల్లో మరో 800 టన్నుల ఉల్లిపాయలను మార్కెట్లోకి తేవడానికి చర్యలు చేపట్టారు.
మిల్లర్లతో ఒప్పందం.. రేట్లపై నిఘా
సామాన్యులకు ఇబ్బంది కలగకుండా బియ్యం ధరలపై మిల్లర్లు, హోల్‌సేల్ వ్యాపారులతో ప్రభుత్వ అధికారులు చర్చలు జరిపారు. బీపీటీ స్టీమ్ రైస్ కిలో రూ.66, సాధారణ స్టీమ్ రకం బియ్యం రూ.47కి మించకుండా విక్రయించేలా ఒప్పందం కుదిరింది. ఇదే సమయంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా కాకుండా చెక్‌పోస్టులు, టోల్గేట్ల వద్ద గస్తీ పెంచాలని అధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మార్కెట్ సెస్సు భారం పడకుండా చూస్తూ, దీపావళి సీజన్లో నిత్యావసరాల ధరలు పెరగకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.




