New Pensions: కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్

New Pensions: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పింఛన్ల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నిరుపేదలకు కూటమి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అందించింది.

CR Reddy
Published on: 25 Sept 2026 7:14 AM IST
New Pensions: కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్
X

New Pensions: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పింఛన్ల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నిరుపేదలకు కూటమి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అందించింది. రాబోయే దసరా పండుగను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన కొత్త లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం దాదాపు 13 లక్షలకు పైగా దరఖాస్తులు అందగా, ప్రస్తుతం అధికారుల పరిశీలన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. సెప్టెంబర్ నెలాఖరు నాటికి ఈ తనిఖీలను పూర్తిగా ముగించి, అర్హత సాధించిన సుమారు 3 లక్షల మంది పేర్లతో కూడిన తుది జాబితాను సిద్ధం చేస్తున్నారు. అక్టోబర్ మొదటి వారంలో లేదా దసరా పండుగకు ముందే ఈ కొత్త పింఛన్ల పంపిణీని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అత్యంత పకడ్బందీగా అనర్హుల ఏరివేత

ఈసారి పింఛన్ల మంజూరు ప్రక్రియలో ప్రభుత్వం ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అత్యంత కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది. దరఖాస్తుదారులు సమర్పించిన పత్రాలు సరైనవేనా, వారికి నిజంగానే ఆర్థిక ఆసరా అవసరమా అనే అంశాలపై అధికారులు క్షేత్రస్థాయిలో ఒకటికి రెండుసార్లు పరిశీలన జరుపుతున్నారు. గతంలో పలుకుబడితో అనర్హులు సైతం లబ్ది పొందిన ఉదంతాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి పటిష్టమైన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే నకిలీ పత్రాలతో పింఛన్లు పొందుతున్న సుమారు 1 లక్ష నుంచి 2 లక్షల వరకు అనర్హుల పేర్లను ఇప్పటికే జాబితా నుంచి తొలగించారు. కేవలం నిజమైన నిరుపేదలు, అత్యవసరంగా ఆర్థిక చేయూత అవసరమైన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు.

వితంతువులు, వృద్ధులు, నిరుపేదలకు పెద్దపీట

కనీసం పూట గడవని వారు, సొంత ఇల్లు లేదా భూమి లేని నిరుపేద కుటుంబాలకు ఈ విడతలో అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ముఖ్యంగా కుటుంబ పెద్దను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్న వితంతు మహిళల నుంచి భారీ స్పందన లభించగా, సుమారు 2.5 లక్షల మందికి పైగా వితంతువులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఆర్థిక భద్రత కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. వీటితో పాటు వృద్ధులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులు తదితర వర్గాల నుంచి వచ్చిన దరఖాస్తులను కూడా నిశితంగా పరిశీలించి తగిన ప్రాధాన్యత కల్పిస్తున్నారు.

దసరా కానుకగా అక్టోబర్‌లో కొత్త పింఛన్ల పంపిణీ

అర్హత సాధించిన కొత్త లబ్ధిదారులకు అక్టోబర్ నెల నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల సొమ్ము నేరుగా అందనుంది. దీని ప్రకారం వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులకు నెలకు రూ.4,000 చొప్పున అందజేస్తుండగా, దివ్యాంగులకు మాత్రం పింఛన్ కింద నెలకు రూ.6,000 అందనుంది. దసరా పండుగ వేళ ప్రభుత్వం నుంచి అందనున్న ఈ ఆర్థిక చేయూత తమ కుటుంబాలకు పెద్ద ఊరటనిస్తుందని నూతన లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.