AP Govt: సీఎం చంద్రబాబు దీపావళి కానుక.. నేడు రైతుల అకౌంట్లోకి రూ.7,000

AP Govt: ఏపీ రైతులకు కూటమి ప్రభుత్వం దీపావళి ధమాకా ఆఫర్ అందించింది. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ కింద నేడే రూ.7,000 అకౌంట్లలో జమ కానున్నాయి.

CR Reddy
Published on: 30 Oct 2026 7:11 AM IST
Annadata Sukhibhava
X

Annadata Sukhibhava 

AP Govt: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నదాతలకు కూటమి ప్రభుత్వం అదిరిపోయే దీపావళి కానుకను అందించింది. అక్టోబర్ 30వ తేదీన అత్యంత ప్రతిష్టాత్మకమైన అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకం నిధులను సీఎం నారా చంద్రబాబు నాయుడు విడుదల చేయనున్నారు. ఇటీవల సంభవించిన అర్నబ్ తుఫాను బీభత్సం, ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొని పంట నష్టపోయిన రైతులకు ఈ ఆర్థిక సాయం పెద్ద ఊరటగా మారనుంది. పండుగకు ముందే రైతన్నల చేతికి డబ్బులు అందుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా హర్షవ్యక్తమవుతోంది.

నేడే రైతుల ఖాతాల్లోకి రూ.7,000 జమ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతు ఖాతాలో ఒకేసారి ఏకంగా రూ.7,000 జమ కానున్నాయి. పిఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.2,000 వాటాతో పాటు, ఏపీ ప్రభుత్వం తన వాటాగా రూ.5,000 నిధులను విడుదల చేస్తోంది. శుక్రవారం నాడే నేరుగా డిబిటి (DBT) పద్ధతిలో బ్యాంక్ ఖాతాల్లోకి ఈ డబ్బులు పడనున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎలాంటి ఆర్భాటాలు, బహిరంగ సభలు లేకుండా నేరుగా బటన్ నొక్కి నిధులను ప్రభుత్వం జమ చేస్తోంది.

46 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు లబ్ధి

ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 46,85,838 మంది రైతు కుటుంబాలకు ఈ విడతలో లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం రూ.3,125 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం విడుదల చేయగా, అందులో ఏపీ సర్కార్ వాటా రూ.2,342.92 కోట్లుగాను, కేంద్ర ప్రభుత్వ వాటా రూ.782.55 కోట్లుగాను ఉంది. గురువారం నిర్వహించిన ఏపీ కేబినెట్ సమావేశంలో ఈ నిధుల విడుదలకు అధికారిక ఆమోదముద్ర వేయడం గమనార్హం. ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జూన్ 20న తొలి విడత విడుదల కాగా, ఇప్పుడు రెండో విడతను అందిస్తున్నారు.

ఏడాదికి రూ.20,000 సహాయం

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరంలో అర్హులైన రైతులకు రూ.20,000 చొప్పున సహాయం అందిస్తున్నారు. ఇందులో ఏపీ ప్రభుత్వం రూ.14,000 భరిస్తుండగా, కేంద్ర ప్రభుత్వం రూ.6,000 ఇస్తోంది. గతేడాది ఆగస్టులో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటికే వేలాది కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో వేశారు. తాజా విడత నిధులతో కలిపి ఇప్పటివరకు మొత్తం రూ.15,236.35 కోట్ల ఆర్థిక సాయాన్ని రైతులకు అందించడం ఒక రికార్డుగా నిలిచింది.

పండుగ వేళ రైతుల్లో నిండిన ఆనందం

త్వరలో దీపావళి పండుగ రాబోతున్న నేపథ్యంలో రైతాంగానికి పెట్టుబడి నిమిత్తం, పండుగ ఖర్చుల కోసం ముందే డబ్బులు విడుదల చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్ణయించాయి. సకాలంలో అందిన ఈ సహాయం వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు కొండంత కొండంత అండగా నిలుస్తోంది. ఎలాంటి దళారులు లేకుండా నేరుగా ఖాతాల్లోనే రూ.7 వేలు జమ అవుతుండటంతో ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.