AP Elections 2026: ఏపీలో మరో ఎన్నికల సమరం.. నవంబర్ 13నే నోటిఫికేషన్?
ఆంధ్రప్రదేశ్లో పెండింగ్లో ఉన్న 23 పట్టణ స్థానిక సంస్థలకు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. నవంబర్ 13న నోటిఫికేషన్, నవంబర్ 26న పోలింగ్ జరిగే అవకాశం ఉందని సమాచారం.
AP Municipal Elections 2026
AP Elections 2026: ఆంధ్రప్రదేశ్లో మరోసారి రాజకీయ వాతావరణం వేడెక్కనుంది. ఇప్పటికే పలు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తికాగా, మిగిలిపోయిన పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టింది. న్యాయపరమైన అడ్డంకులు తొలగడంతో ఎన్నికల ప్రక్రియ ముందుకు కదులుతున్నట్లు సమాచారం. నవంబర్ 13న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి, అదే నెల 26న పోలింగ్ నిర్వహించేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
23 పట్టణాల్లో ఎన్నికల సందడి
రాష్ట్రంలో ఉన్న 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఇప్పటికే 100 చోట్ల ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. మిగిలిన 23 పట్టణ స్థానిక సంస్థలకు ఇప్పుడు ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటిలో శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్లు ఉన్నాయి. వీటితో పాటు ఆముదాలవలస, రాజాం, అల్లూరు, బి.కొత్తకోట, తాడిగడప, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, గుడివాడ, చింతలపూడి, నరసరావుపేట, పొన్నూరు, బాపట్ల, పొదిలి, కందుకూరు, గూడూరు, కావలి, శ్రీకాళహస్తి పట్టణాల్లోనూ ఎన్నికలు జరగనున్నాయి.
1,009 స్థానాలకు ఎన్నికల పోరు
ఈ ఎన్నికల్లో నాలుగు కార్పొరేషన్ల పరిధిలో 260 డివిజన్లకు, మిగిలిన 19 పట్టణ స్థానిక సంస్థల్లో 749 వార్డులకు ఓటింగ్ జరగనుంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో మేయర్, చైర్పర్సన్, వార్డు స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయినట్లు సమాచారం. దీంతో ప్రధాన పార్టీల దృష్టి అభ్యర్థుల ఎంపికపై పడింది. స్థానికంగా గెలుపు అవకాశాలు ఉన్న నేతలను గుర్తించి బరిలోకి దింపేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. నోటిఫికేషన్ వెలువడితే నామినేషన్లు, ప్రచారం, పోలింగ్ ఏర్పాట్లు మరింత వేగం పుంజుకోనున్నాయి.
కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలపై కసరత్తు
అధికార కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు కీలకంగా మారనుంది. అందుతున్న సమాచారం ప్రకారం శ్రీకాకుళం, కాకినాడ కార్పొరేషన్లలో జనసేన, రాజమహేంద్రవరంలో బీజేపీ, మంగళగిరి-తాడేపల్లిలో టీడీపీ పోటీ చేసే అవకాశాలున్నాయి. మిగిలిన మున్సిపాలిటీల్లో స్థానిక రాజకీయ పరిస్థితులు, ఆయా పార్టీల బలాబలాలను బట్టి సీట్లు కేటాయించే యోచనలో కూటమి నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. టికెట్లు ఆశిస్తున్న నాయకులు ఇప్పటికే తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు.
కూటమికి మరో పరీక్ష.. వైసీపీ వ్యూహాలు ఏమిటి?
ఈ ఎన్నికలు అధికార కూటమికి మరో రాజకీయ పరీక్షగా మారనున్నాయి. ఇటీవల స్థానిక ఎన్నికల్లో సాధించిన విజయాలను కొనసాగించాలని టీడీపీ, జనసేన, బీజేపీ భావిస్తున్నాయి. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. పట్టణ ప్రాంతాల్లో తమకు ఉన్న పట్టును నిరూపించుకునేందుకు బలమైన అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో 23 పట్టణాల్లో పోటీ ఆసక్తికరంగా మారనుంది. నవంబర్ 13న నోటిఫికేషన్, 26న పోలింగ్ ఉంటాయన్న ప్రచారంపై అధికారిక స్పష్టత వస్తే ఏపీలో ఎన్నికల సందడి మరింత పెరగనుంది.




