Chandrababu Naidu: మురసు తుఫాన్ ముప్పు.. సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష..!
Chandrababu Naidu: ఆర్నబ్ తుఫాన్ నష్టాల నుంచి ఆంధ్రప్రదేశ్ ఇంకా పూర్తిగా కోలుకోకముందే మరో తుఫాన్ ముప్పు పొంచి ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
Chandrababu Naidu: మురసు తుఫాన్ ముప్పు.. సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష..!
Chandrababu Naidu: ఆర్నబ్ తుఫాన్ నష్టాల నుంచి ఆంధ్రప్రదేశ్ ఇంకా పూర్తిగా కోలుకోకముందే మరో తుఫాన్ ముప్పు పొంచి ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాబోయే తుఫాన్‌పై సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని రేపు చేపట్టాల్సిన ఢిల్లీ పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. తుఫాన్ ప్రభావం, భారీ వర్షాల అంచనాలు, వరద ముప్పు, విద్యుత్ వ్యవస్థ పరిస్థితిపై అధికారులతో చర్చించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నవంబర్ 3న తీరం దాటే అవకాశం
ప్రస్తుతం ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. ఆ తర్వాత తుఫాన్‌గా మారి నవంబర్ 2 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడే సూచనలు ఉన్నాయని తెలిపారు. నవంబర్ 3న ఉదయం బాపట్ల సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేశారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు.
కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన
నవంబర్ 2న దక్షిణ, మధ్య కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా పడొచ్చని అంచనా వేశారు. నవంబర్ 3, 4 తేదీల్లోనూ పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని చెప్పారు. ఏలూరు జిల్లాలో 9 మండలాలు, కృష్ణా జిల్లాలో 5, ఎన్టీఆర్ జిల్లాలో 5, బాపట్ల జిల్లాలో ఒక మండలంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.
అధికారుల అంచనాల ప్రకారం నవంబర్ 3న జిల్లా సగటు వర్షపాతం ఏలూరులో 179 మిల్లీమీటర్లు, కృష్ణాలో 163, ఎన్టీఆర్ జిల్లాలో 161, పశ్చిమ గోదావరిలో 147, గుంటూరులో 119, బాపట్లలో 104 మిల్లీమీటర్ల వరకు ఉండొచ్చని తెలిపారు. ఈ అంచనాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
బుడమేరుకు వరద ముప్పు
భారీ వర్షాలు కురిస్తే వాగులు, వంకల్లో వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. నవంబర్ 3న బుడమేరుకు సుమారు 32,500 క్యూసెక్కుల వరద ప్రవాహం రావొచ్చని అంచనా వేశారు. ఎర్రకాల్వ, గోనెలవాగు, జల్లేరు, పంపా తదితర వాగుల్లోనూ భారీ వరదలు వచ్చే ప్రమాదం ఉందని సీఎంకు వివరించారు. దీంతో వరద ప్రభావిత ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అవసరమైన చర్యలు చేపట్టాలని చంద్రబాబు సూచించారు.
విద్యుత్ వ్యవస్థకు భారీ నష్టం జరిగే అవకాశం
తుఫాన్‌తో వీచే బలమైన గాలుల వల్ల విద్యుత్ వ్యవస్థకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. 12 జిల్లాల్లో సుమారు 12,102 నుంచి 15,128 విద్యుత్ స్తంభాలు దెబ్బతినే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు, గత ఆర్నబ్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులపై సీఎం ఆరా తీశారు. ఆ రోజు రాత్రికే అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు సీఎంకు హామీ ఇచ్చారు.
ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు
రాబోయే తుఫాన్ నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని చంద్రబాబు ఆదేశించారు. ముఖ్యంగా ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. వరద ప్రభావిత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
తుఫాన్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, వర్షాలు, గాలులు, వరదలపై వచ్చే సమాచారానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే ఒక తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొంటున్న రాష్ట్రానికి మరో ముప్పు పొంచి ఉండటంతో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. వాతావరణ అంచనాలు, అధికారుల హెచ్చరికలను ప్రజలు గమనిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.




