బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం.. కోస్తాకు IMD హైఅలర్ట్
Andhra Pradesh Cyclone: ఆంధ్రప్రదేశ్ తీరానికి తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం క్రమంగా బలపడుతూ తుపానుగా, ఆ తర్వాత అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.
బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం.. కోస్తాకు IMD హైఅలర్ట్
Andhra Pradesh Cyclone: ఆంధ్రప్రదేశ్ తీరానికి తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం క్రమంగా బలపడుతూ తుపానుగా, ఆ తర్వాత అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. అక్టోబర్ 28న బాపట్ల, విశాఖపట్నం మధ్య యానాం సమీపంలో తీరం దాటే సూచనలు ఉన్నాయని అంచనా వేసింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, కొన్ని సందర్భాల్లో వాటి వేగం 140 కిలోమీటర్లకు చేరవచ్చని తెలిపింది. దీంతో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తమై తీరప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.
దశలవారీగా బలపడనున్న తుపాను
ఆదివారం ఉదయం 11.30 గంటల సమయానికి తీవ్ర వాయుగుండం విశాఖపట్నానికి ఆగ్నేయంగా 870 కిలోమీటర్లు, కాకినాడకు 960 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 1,060 కిలోమీటర్లు, బాపట్లకు 1,130 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం గంటకు 5 కిలోమీటర్ల వేగంతో నైరుతి దిశగా కదులుతున్న ఈ వాతావరణ వ్యవస్థ సోమవారం ఉదయానికి తుపానుగా మారవచ్చని అంచనా వేస్తున్నారు.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, అక్టోబర్ 27 ఉదయానికి ఇది తీవ్ర తుపానుగా, అక్టోబర్ 28 ఉదయానికి అతి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉంది. అనంతరం వాయవ్య దిశగా కదులుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి ఏపీ తీరానికి చేరువవుతుందని అధికారులు భావిస్తున్నారు.
భారీ వర్షాలు.. ప్రచండ గాలుల ముప్పు
తుపాను ప్రభావంతో తీరప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో పాటు అలల ఉద్ధృతి పెరిగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, యానాం తీరాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ మెసేజ్ జారీ చేసింది. తుపాను కదలికలు, తీవ్రతను బట్టి తదుపరి హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంది.
మత్స్యకారులకు కీలక హెచ్చరిక
తుపాను ముప్పు నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని కోరింది. పడవలు, వలలను భద్రమైన ప్రదేశాల్లో ఉంచాలని హెచ్చరించింది. సముద్రంలో అలల ఉద్ధృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున బీచ్‌ల వద్దకు వెళ్లడం, సెల్ఫీలు దిగడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
అప్రమత్తమైన అధికార యంత్రాంగం
తుపాను కదలికలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తీరప్రాంత జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి, అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రజలు వాతావరణ శాఖ, ప్రభుత్వ విభాగాలు జారీ చేసే అధికారిక సూచనలను అనుసరించాలని, వదంతులను నమ్మవద్దని అధికారులు సూచిస్తున్నారు.




