YS Jagan: కడపలో వైసీపీకి బిగ్ షాక్.. జగన్ సొంత కోటలో కూటమి పాగా..!

YS Jagan: ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది.

Gagan kumar
Published on: 21 Oct 2026 9:49 AM IST
YS Jagan
X

 YS Jagan: కడపలో వైసీపీకి బిగ్ షాక్.. జగన్ సొంత కోటలో కూటమి పాగా..!

YS Jagan: కడప రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆయన సొంత జిల్లాలోనే తీవ్ర రాజకీయ పరాభవం ఎదురైంది. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కమ్మని కోటగా ఉన్న ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ-జనసేన-బీజేపీ కూటమి తన రాజకీయ సత్తాను చాటుతూ జయకేతనం ఎగురవేసింది.

ఉమ్మడి కడప జిల్లాలోని మున్సిపల్ స్థానాలపై టీడీపీ తన పట్టును తిరుగులేని విధంగా నిరూపించుకుంది. వరుసగా మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటూ వైఎస్ఆర్‌సీపీ కోటలను బద్దలుకొట్టింది. ప్రొద్దుటూరు, బద్వేల్, జమ్మలమడుగుతో పాటు రాయచోటి, రాజంపేట, కమలాపురం మున్సిపాలిటీలను టీడీపీ పూర్తిస్థాయిలో ఏకగ్రీవంగా తన వశం చేసుకుంది. పొత్తు ధర్మాన్ని నిలబెట్టుకుంటూ ఎర్రగుంట్ల మున్సిపాలిటీని మిత్రపక్షమైన బీజేపీ ఖాతాలో చేర్చడం ద్వారా కూటమి పార్టీలు తమ బలాన్ని, ఐక్యతను చాటిచెప్పాయి.

ఈ రాజకీయ పరిణామాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశం స్వయంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల మున్సిపాలిటీ. వైసీపీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన పులివెందులను కూడా కైవసం చేసుకునేందుకు టీడీపీ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. జగన్ సొంత గడ్డపైనే రాజకీయ సంచలనం సృష్టించడమే లక్ష్యంగా కూటమి నాయకులు పావులు కదుపుతున్నారు.

ఈ సంచలన పరిణామాలపై కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి కడప జిల్లా రాజకీయాల్లో రాబోయే రోజుల్లో ప్రజలు ఊహించని సరికొత్త మార్పులను, వినూత్న రాజకీయ పరిణామాలను చూడబోతున్నారు. కూటమి పాలనపై ప్రజల్లో నెలకొన్న నమ్మకానికి ఈ గెలుపు నిదర్శనం అని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

ఎంతో కాలంగా కడప అంటే వైఎస్ కుటుంబం అనే ముద్రను చెరిపేస్తూ, వరుస స్థానాలను కైవసం చేసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జగన్ కోటలోనే టీడీపీ కూటమి ఈ స్థాయిలో విరుచుకుపడటం వైసీపీ శ్రేణుల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.