Hindupur: అకౌంట్లో వెయ్యి కోట్లు చూసి షాక్.. అరగంటకే మరో బిగ్ షాక్!
Hindupur: హిందూపురం వ్యాపారి తోట ఆనంద్ ఖాతాలో రూ.వెయ్యి కోట్లు జమ. కేవలం అరగంటలోనే సొంత డబ్బులతో సహా ఖాళీ! పోలీసులకు ఫిర్యాదు.
Hindupur: అకౌంట్లో వెయ్యి కోట్లు చూసి షాక్.. అరగంటకే మరో బిగ్ షాక్!
Hindupur: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వింత బ్యాంకింగ్ లావాదేవీల వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. స్థానిక వ్యాపారి బ్యాంక్ ఖాతాలో ఉన్నట్టుండి ఒక్కసారిగా ఏకంగా రూ.1,000 కోట్లు జమ అయినట్లు కనిపించడంతో ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇంత భారీ మొత్తం తన ఖాతాలోకి ఎలా వచ్చిందో అర్థం కాక అయోమయంలో పడిన బాధితుడికి, ఆ ఆనందం కేవలం అరగంట మాత్రమే నిలిచింది. అర్ధగంట వ్యవధిలోనే ఖాతాలోని వెయ్యి కోట్లతో పాటు ఆయన దాచుకున్న సొంత సొమ్ము కూడా మాయమైపోయి నిల్వ 'జీరో' చూపించడంతో బాధితుడు బ్యాంకు అధికారులను, పోలీసులను ఆశ్రయించారు.
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. హిందూపురంలోని సదాశివనగర్‌కు చెందిన తోట ఆనంద్ స్థానికంగా రవాణా వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఆయనకు నగరంలోని ఒక ప్రైవేటు బ్యాంకులో పొదుపు ఖాతా ఉంది. మధ్యాహ్నం వేళ ఆయన మొబైల్‌కు బ్యాంకు నుంచి ఓ లావాదేవీ మెసేజ్ రావడంతో తెరిచి చూశారు. అప్పటివరకు ఖాతాలో కేవలం రూ.32,000 మాత్రమే నిల్వ ఉండగా, ఒక్కసారిగా ఆ మొత్తం ఏకంగా రూ.1,000 కోట్లకు చేరినట్లు ఫోన్ స్క్రీన్‌పై ప్రత్యక్షమైంది. నిజమో కాదో నిర్ధారించుకునేందుకు ఆనంద్ తన స్నేహితులకు కూడా ఆ ఖాతా వివరాలు మరియు బ్యాలెన్స్ చూపిస్తూ ఆశ్చర్యపోయారు.
అయితే ఈ అసలు కథ వెనుక సాంకేతిక లోపమా లేక సైబర్ నేరగాళ్ల హస్తమా అని తెలుసుకునేలోపే మరో ఘోరం జరిగిపోయింది. వెయ్యి కోట్లు కనిపించిన కేవలం అరగంట వ్యవధిలోనే ఖాతాలోని బ్యాలెన్స్ అంతా తుడిచిపెట్టుకుపోయి సున్నాకు చేరింది. వెయ్యి కోట్ల సంగతి పక్కనబెడితే, అంతకుముందు తన ఖాతాలో ఉన్న సొంత సొమ్ము రూ.32,000 కూడా ఖాళీ అవ్వడంతో ఆనంద్ హతాశుడయ్యారు.
వెంటనే సంబంధిత బ్యాంకుకు వెళ్లి అధికారులను నిలదీయగా అక్కడ నుంచి సరైన స్పందన లభించకపోవడంతో హిందూపురం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ రంగానికి కూడా ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు. తనకు ఆ వెయ్యి కోట్లు అక్కర్లేదని, కనీసం తన కష్టార్జితమైన సొంత డబ్బులనైనా ఇప్పించాలని ఆయన కన్నీటిపర్యంతమయ్యారు.




