Anantapur: వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ప్రెస్‌మీట్!

Anantapur: అనంతపురం వైసీపీ జిల్లా కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించిన వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి. సచివాలయ ఉద్యోగులపై లాఠీచార్జ్‌ను ఖండన.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 28 Sept 2026 4:39 PM IST
Anantapur
X

Anantapur: వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ప్రెస్‌మీట్!

Anantapur: అనంతపురం వైసీపీ జిల్లా కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. విజయవాడలో తమ సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన చేపట్టిన సచివాలయ ఉద్యోగులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేయడం, ఉద్యోగులను నిర్బంధించడం దారుణమని ఆయన విమర్శించారు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి లక్షా 35 వేల మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించిందని అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ ఉద్యోగులపై అదనపు పనిభారం మోపుతోందని ఆరోపించారు. నోషనల్‌ ఇంక్రిమెంట్లు మంజూరు చేసి జూనియర్‌ అసిస్టెంట్‌ కేడర్‌గా గుర్తించాలని, ప్రమోషన్‌ విధానం కల్పించాలని ఉద్యోగులు కోరడం తప్పా అని ప్రశ్నించారు.

జీవో నంబర్‌ 11ను రద్దు చేయడంతో పాటు జీవో నంబర్‌ 5ను పునఃసమీక్షించాలని డిమాండ్‌ చేశారు.శాంతియుతంగా నిరసన చేస్తున్న ఉద్యోగులపై లాఠీచార్జ్‌ చేయడం, మహిళా ఉద్యోగులను పోలీస్‌ స్టేషన్లలో నిర్బంధించడం సరికాదన్నారు. ఉద్యోగులపై జరిగిన ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులకు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, పీఆర్సీ కమిషన్‌ చైర్మన్‌ను కూడా ఇప్పటివరకు నియమించలేదని అనంత వెంకటరామిరెడ్డి ఆరోపించారు.ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు అందిస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు.అనంతపురం కార్పొరేషన్‌ డివిజన్ల విభజనపైనా అనంత వెంకటరామిరెడ్డి విమర్శలు చేశారు.

50 డివిజన్లను 62 డివిజన్లుగా మారుస్తున్న నేపథ్యంలో జనాభాకు అనుగుణంగా విభజన జరగాల్సి ఉన్నా క్షేత్రస్థాయిలో అలా జరగలేదని ఆరోపించారు. కొన్ని డివిజన్లలో 2 వేల ఓట్లు ఉంటే మరికొన్ని డివిజన్లలో 5 వేల ఓట్లు ఉండటం ఏంటని ప్రశ్నించారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు సంబంధించిన రిజర్వేషన్ల గుర్తింపు ప్రక్రియ కూడా నిష్పక్షపాతంగా జరగలేదని విమర్శించారు. అధికార పార్టీ నేతలకు అనుకూలంగా డివిజన్ల విభజన, కులాల గుర్తింపు జరిగిందనే ఆరోపణలు చేశారు.జిల్లా ఎన్నికల అధికారి, అనంతపురం కార్పొరేషన్‌ ప్రత్యేక అధికారిగా ఉన్న కలెక్టర్‌ ఈ వ్యవహారంపై దృష్టి సారించాలని, డివిజన్ల విభజనతో పాటు కులాల గుర్తింపు ప్రక్రియను మరోసారి క్రాస్‌చెక్‌ చేసి నిష్పక్షపాతంగా నిర్వహించాలని కోరారు.

ప్రభుత్వ ఖజానాను టీడీపీ కార్యకర్తలకు కట్టబెట్టేందుకే ఇన్‌ఫ్లుయెన్సర్‌ పాలసీ తీసుకొచ్చారని అనంత వెంకటరామిరెడ్డి ఆరోపించారు. గతంలో ప్రభుత్వ వైఫల్యాలను సోషల్‌ మీడియాలో ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు సోషల్‌ మీడియా ప్రచారం కోసం కొత్త విధానం తీసుకొస్తోందని విమర్శించారు.స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొంటామని, కూటమి పార్టీలకు వ్యతిరేకంగా ప్రజాతీర్పు ఉంటుందని అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM