Anantapur: అనంతపురం రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుడిని కాపాడిన కానిస్టేబుల్!

Anantapur: అనంతపురం రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలు నుంచి పడిపోబోയ ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ సి.సురేంద్రను ఎస్పీ పి.జగదీష్ సన్మానించారు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 4 Oct 2026 10:55 AM IST
Anantapur
X

Anantapur: అనంతపురం రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుడిని కాపాడిన కానిస్టేబుల్!

Anantapur: అనంతపురం రైల్వేస్టేషన్లో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన అనంతపురం రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు వేలాడుతున్న ఓ ప్రయాణికుడిని తన ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సి. సురేంద్రను జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఐపీఎస్ అభినందించి ఘనంగా సన్మానించారు.

గత నెల 29న ఉదయం అనంతపురం రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.తిరుపతి జిల్లా వెంకటగిరి బందోబస్తు విధులకు వెళ్తున్న ట్రాఫిక్ ఎస్ఐ రామాంజుల రెడ్డిని రైలు ఎక్కించేందుకు కానిస్టేబుల్ సురేంద్ర, హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణ స్టేషన్‌కు వెళ్లారు.ఎస్ఐని రైలు ఎక్కించిన అనంతరం ప్లాట్‌ఫామ్ నంబర్ 4పై నడుచుకుంటూ వస్తుండగా..

భైరవనగర్‌కు చెందిన 49 ఏళ్ల రవికుమార్ కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించాడు.అయితే ప్రమాదవశాత్తు పట్టు జారి, ఒక చేతితో హ్యాండిల్ పట్టుకుని రైలు నుంచి వేలాడుతూ కనిపించాడు.దీన్ని గమనించిన కానిస్టేబుల్ సురేంద్ర వెంటనే అప్రమత్తమయ్యారు.పరిగెత్తుకుంటూ వెళ్లి రవికుమార్‌ను గట్టిగా పట్టుకుని ప్లాట్‌ఫామ్‌పైకి లాగారు.

దీంతో పెను ప్రమాదం తప్పి రవికుమార్ ప్రాణాలతో బయటపడ్డాడు.తన ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ సురేంద్రను రవికుమార్ కంటతడి పెట్టుకుంటూ అభినందించాడు.సురేంద్రే తన పాలిట దేవుడని పేర్కొంటూ ఆయన పాదాలకు నమస్కరించాడు. ఈ ఘటనను చూసిన ప్రయాణికులు, రైల్వే సిబ్బంది సైతం కానిస్టేబుల్ సాహసాన్ని అభినందించారు.

కానిస్టేబుల్ సురేంద్ర ధైర్యసాహసాలు, సమయస్ఫూర్తి గురించి తెలుసుకున్న జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఆయనను జిల్లా పోలీసు కార్యాలయానికి పిలిపించి ప్రత్యేకంగా అభినందించారు.ప్రజల ప్రాణాలను రక్షించడం పోలీసుల ప్రాథమిక విధి అని, సురేంద్ర చూపిన చొరవ పోలీసు శాఖకే గర్వకారణమని ఎస్పీ కొనియాడారు.

అనంతరం జిల్లా పోలీసు యంత్రాంగం తరఫున ఎస్పీ చేతుల మీదుగా సురేంద్రను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ వెంకటేష్ నాయక్, ఆర్‌ఐ పవన్ కుమార్, ట్రాఫిక్ ఎస్‌ఐ రాంభూపాల్, పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోకనాథ్, సూర్యకుమార్, గాండ్ల హరినాథ్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM