Anantapur: కూటమి నేతల తీరుపై శైలజనాథ్ తీవ్ర ఆగ్రహం!
Anantapur: సింగనమలలో కూటమి నేతల తీరుపై శైలజనాథ్ విమర్శలు. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి మౌనిక నామినేషన్ అడ్డుకున్నారని, అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపణ.
Anantapur: కూటమి నేతల తీరుపై శైలజనాథ్ తీవ్ర ఆగ్రహం!
రాష్ట్రంలో కూటమి నాయకుల వ్యవహారశైలి చూస్తుంటే జాలేస్తోందని సింగనమల నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త శైలజనాథ్ విమర్శించారు.ప్రజలకు మేలు చేయాల్సిన నాయకులను, కీడు చేసే విధంగా చంద్రబాబు నాయుడు తయారు చేశారని ఆరోపించారు.
తెలుగుదేశం పార్టీ అనగానే మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు గుర్తుకొస్తారని శైలజనాథ్ వ్యాఖ్యానించారు.నాయకులు మంచి ప్రవర్తనతో ఉండాలని చెప్పాల్సిన ముఖ్యమంత్రి, విధ్వంసానికి ముందుండాలని ఆదేశిస్తున్నారని విమర్శించారు.
ఎన్నికల్లో దౌర్జన్యాలు, గూండాగిరికి టీడీపీనే కారణమని ఆరోపించారు.వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడమే కాకుండా, టీడీపీ అభ్యర్థులతో నామినేషన్లు వేయించి, ఆ తర్వాత వాటిని ఉపసంహరించుకునేలా చేయడం సిగ్గుచేటని శైలజనాథ్ అన్నారు.తిమ్మంపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి మౌనికను ఉదయం నుంచి పోలీస్‌స్టేషన్‌లోనే ఉంచి, నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.
నామినేషన్లు వేసిన అభ్యర్థులకు ఫారం-5 పత్రాలు ఇవ్వకుండానే పంపించారని తెలిపారు. కూటమి నాయకులు కార్యాలయాల్లో కూర్చొని అధికారులపై ఒత్తిడి తెస్తూ, వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.
ఈ వ్యవహారాలపై ఎన్నికల అధికారులు తక్షణమే స్పందించాలని శైలజనాథ్ డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించి, పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పించాలని కోరారు.




