Rayadurgam: రాయదుర్గం మున్సిపల్ చైర్మన్‌గా టెంకశాల హనుమంతు ప్రమాణం

Rayadurgam: అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపల్ చైర్మన్‌గా టెంకశాల హనుమంతు, వైస్ చైర్మన్‌గా భాష, 40 వార్డుల కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం; ఎమ్మెల్యే కాలవ హాజరు.

M.MITHRAM CHARKRAVARTHY, RAYADURGAM
Published on: 23 Nov 2026 5:55 PM IST
Rayadurgam
X

Rayadurgam: రాయదుర్గం మున్సిపల్ చైర్మన్‌గా టెంకశాల హనుమంతు ప్రమాణం

రాయదుర్గం: రాయదుర్గం మున్సిపాలిటీలో నూతన పాలకవర్గం కొలువుదీరింది. మున్సిపల్ చైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి టెంకశాల హనుమంతుతో పాటు వైస్ చైర్మన్‌గా భాష, 40 వార్డుల కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు సమక్షంలో ఘనంగా జరిగింది.

ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పురస్కరించుకుని రాయదుర్గం పట్టణంలో టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని బళ్లారి రోడ్డు వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, టీడీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి మున్సిపాలిటీ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా బయలుదేరారు.

బళ్లారి రోడ్డు, అనంతపురం రోడ్డు, లక్ష్మీ బజార్ మీదుగా సాగిన ఈ ర్యాలీలో టీడీపీ, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతన మున్సిపల్ చైర్మన్ టెంకశాల హనుమంతుకు శుభాకాంక్షలు తెలిపేందుకు పట్టణ ప్రజలు భారీగా తరలివచ్చారు.

అనంతరం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మెజారిటీతో ఘన విజయం సాధించిన టెంకశాల హనుమంతు మున్సిపల్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. వైస్ చైర్మన్‌గా భాషతో పాటు 40 వార్డుల కౌన్సిలర్లు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సమక్షంలో ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.

ఈ సందర్భంగా నూతన మున్సిపల్ చైర్మన్ టెంకశాల హనుమంతు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో మెజారిటీతో గెలిపించిన రాయదుర్గం పట్టణ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. పట్టణ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు రాయదుర్గం సమగ్ర అభివృద్ధికి ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సహకారంతో కృషి చేస్తానని తెలిపారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు తనపై ఉంచిన బాధ్యతలను చిత్తశుద్ధితో, అంకితభావంతో నిర్వర్తిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని టెంకశాల హనుమంతు స్పష్టం చేశారు.

M.MITHRAM CHARKRAVARTHY, RAYADURGAM

M.MITHRAM CHARKRAVARTHY, RAYADURGAM