Penugonda: పెనుగొండలో వీఆర్ఏల కదం తొక్కిన ర్యాలీ: డిమాండ్ల సాధనకు పోరు
Penugonda: ఏపీ వీఆర్ఏ జేఏసీ పిలుపు మేరకు పెనుగొండలో వీఆర్ఏలు భారీ ర్యాలీ నిర్వహించి, సమస్యల పరిష్కారం కోరుతూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
Penugonda: పెనుగొండలో వీఆర్ఏల కదం తొక్కిన ర్యాలీ: డిమాండ్ల సాధనకు పోరు
పెనుగొండ: ఏపీ వీఆర్ఏ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ( ఈ ఆర్ ఎ జె ఎ సి ) పిలుపు మేరకు వీఆర్ఏలు రెండో రోజు గురువారం పెనుగొండలో ర్యాలీ నిర్వహించారు. నరసాపురం డివిజన్ వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు తానేటి నాగరాజు ఆధ్వర్యంలో గాంధీ బొమ్మల సెంటర్ నుంచి గ్రామపంచాయతీ కార్యాలయం వద్దనున్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ సాగింది. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా తానేటి నాగరాజు మాట్లాడుతూ గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థకు వెన్నుదన్నుగా పనిచేస్తున్న వీఆర్ఏల సమస్యలపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని కోరారు. ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్నా వేతనాలు, ఉద్యోగ భద్రత, పదోన్నతులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.
వీఆర్ఏలకు పేస్కేల్ అమలు చేయడంతో పాటు నామినీ వీఆర్ఏలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. అర్హత కలిగిన వీఆర్ఏలకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ విధానంలో వీఆర్‌ఓలుగా పదోన్నతులు కల్పించాలని కోరారు. వీఆర్‌ఓ, అటెండర్, నైట్‌వాచ్‌మన్ పోస్టుల్లో వీఆర్ఏలకు ఉన్న పదోన్నతి కోటాను 20 శాతం నుంచి 70 శాతానికి పెంచాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం తమ డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి న్యాయం చేయాలని నాగరాజు కోరారు. ర్యాలీలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 30 మందికి పైగా వీఆర్ఏలు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.




