Kalyandurg: జాతీయ స్థాయిలో మెరిసిన కొండాపురం!

Kalyandurg: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కొండాపురం గ్రామ పంచాయతీకి జాతీయ స్థాయి గుర్తింపు. 'నీటి సమృద్ధి గ్రామం' విభాగంలో దేశంలోనే ప్రథమ స్థానం.

P.Sudhakar, Kalyanadurgam
Published on: 30 Oct 2026 11:43 AM IST
Kalyandurg
X

Kalyandurg: జాతీయ స్థాయిలో మెరిసిన కొండాపురం!

Kalyandurg: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం లో గ్రామాభివృద్ధికి చేపట్టిన నీటి సంరక్షణ చర్యలు కొండాపురం గ్రామానికి జాతీయ స్థాయి గుర్తింపును తీసుకొచ్చాయి.

కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డుల్లో నీటి సమృద్ధి గ్రామం (Water Sufficient Village) విభాగంలో దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల నుంచి పోటీ ఉండగా, కొండాపురం గ్రామపంచాయతీ మొదటి స్థానానికి ఎంపికైంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని గురువారం కేంద్ర స్థాయి అధికారుల బృందం గ్రామాన్ని సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలించింది.

కేంద్ర బృందం సభ్యులు జకీర్ హుస్సేన్, ఆశిష్ యాదవ్‌తో పాటు రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయ ఓఎస్డీ శ్రీనాథరెడ్డి, రాష్ట్ర నోడల్ అధికారి మల్లీశ్వరి, డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి అమానుల్లా, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారి విజయభాస్కర్ తదితరులు పర్యటనలో పాల్గొన్నారు.

ముందుగా పంచాయతీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించిన అధికారులు గ్రామంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. స్థానికులతో మాట్లాడి పంచాయతీ పనితీరుపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

కొండాపురం గ్రామంలో నీటి వనరుల అభివృద్ధికి గతంలోనే ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టినట్లు స్థానికులు వివరించారు. ఉపాధి హామీ, వాటర్‌షెడ్ పనుల్లో భాగంగా గ్రామ పెద్దల సహకారంతో వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

ఇందులో భాగంగా గ్రామ పరిసరాల్లో ఫామ్ పాండ్లు, చెక్‌డ్యామ్‌లు, మట్టి కట్టలు నిర్మించారు. ఈ పనుల ఫలితంగా నీటి నిల్వలు పెరిగి, గత 15 ఏళ్లుగా గ్రామంలో నీటి కొరత సమస్య ఎదురుకాలేదని తెలిపారు.

నీటి సంరక్షణతో పాటు పారిశుధ్యం, పర్యావరణ పరిరక్షణకు కూడా గ్రామం ప్రాధాన్యం ఇచ్చింది. పొగరహిత గ్రామం, మరుగుదొడ్ల వినియోగం, పరిశుభ్రత, పచ్చదనం వంటి అంశాల్లోనూ గ్రామపంచాయతీ అభివృద్ధి సాధించిందని అధికారులు గుర్తించారు. ఈ వివరాలన్నింటినీ పంచాయతీ కార్యదర్శి లోకేష్ పంచాయతీ అడ్వాన్స్‌మెంట్ ఇండెక్స్‌లో నమోదు చేయడంతో కేంద్ర ప్రభుత్వం గ్రామాన్ని గుర్తించి క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది.

పర్యటనలో భాగంగా అధికారులు ఫామ్ పాండ్లు, ఇంకుడు గుంతలు, ఇతర నీటి సంరక్షణ నిర్మాణాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. గ్రామంలో ప్రజలకు అందుతున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ధనుంజయనాథ్, ఉప ఎంపీడీవో రంగనాయకులు, పంచాయతీ కార్యదర్శులు లోకేష్, రంగనాథ్, నవీన్, ప్రకాష్, నాగార్జున, స్వర్ణగ్రామ, ఉపాధి హామీ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

P.Sudhakar, Kalyanadurgam

P.Sudhakar, Kalyanadurgam