Kadiri: కదిరిలో ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే కందికుంట!

Kadiri: కదిరిలో ఎమ్మెల్యే కందికుంట ప్రజాదర్బార్; మార్చి 2027 నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి చేస్తామని, అనధికార లేఅవుట్లపై చర్యలు ఉంటాయని హామీ ఇచ్చారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 3 Oct 2026 7:54 AM IST
Kadiri
X

Kadiri: కదిరిలో ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే కందికుంట!

Kadiri: సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని 29, 30వ వార్డుల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే లక్ష్యంతో కదిరి మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయా వార్డులకు చెందిన ప్రజల నుంచి వినతులను స్వీకరించి, వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సంబంధిత మున్సిపల్ అధికారులతో మాట్లాడి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సంక్షేమం, అభివృద్ధి అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, పట్టణంలోని ప్రతి వార్డులో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.

అనధికార లేఅవుట్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మున్సిపాలిటీ అనుమతి పొందిన లేఅవుట్లలోనే ప్లాట్లు కొనుగోలు చేయాలని ప్రజలకు సూచించారు.

అనుమతులు లేని లేఅవుట్లలో స్థలాలు కొనుగోలు చేయడం వల్ల భవిష్యత్తులో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. ఆమోదిత లేఅవుట్లలో ప్రణాళికాబద్ధమైన పట్టణ అభివృద్ధికి అవకాశం ఉంటుందని వివరించారు.

ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలాలు మంజూరు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పేదలకు సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు.

గతంలో టిడ్కో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకొని, డీడీలు చెల్లించి, ఇప్పటికీ బ్యాంకులకు వాయిదాలు చెల్లిస్తున్న లబ్ధిదారులకు కూడా శుభవార్త అందించారు. అర్హులైన లబ్ధిదారులకు 2027 మార్చి నెలాఖరులోగా టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించడమే ప్రజాదర్బార్ ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, 29, 30వ వార్డుల ప్రజలు పాల్గొన్నారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI