Rayadurgam: రాయదుర్గం ప్రజలకు 30 ఏళ్ల తాగునీటి భరోసా ఎమ్మెల్యే కాలవ

Rayadurgam: రాయదుర్గంలో రూ.78 కోట్లతో చేపట్టిన అమృత్-2 తాగునీటి పనులను ఎమ్మెల్యే కాలవ పరిశీలించారు. రాబోయే 30 ఏళ్లపాటు తాగునీటి సమస్య ఉండదని వెల్లడించారు.

M. MITHRAM, ANANTAPURURAM
Published on: 10 Oct 2026 5:35 PM IST
Rayadurgam
X

Rayadurgam: రాయదుర్గం ప్రజలకు 30 ఏళ్ల తాగునీటి భరోసా ఎమ్మెల్యే కాలవ

రాయదుర్గం: రాయదుర్గం పట్టణ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు అమృత్-2 పథకం కింద రూ.78 కోట్లతో చేపట్టిన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. రాయదుర్గం పట్టణంలో కొనసాగుతున్న తాగునీటి పనులను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మున్సిపల్, పబ్లిక్ హెల్త్ అధికారుల సమన్వయంతో జిందాల్ షా సంస్థ ఈ పనులను చేపట్టిందన్నారు.

ఈ పథకం ద్వారా రాయదుర్గం పట్టణానికి రాబోయే 30 ఏళ్ల పాటు తాగునీటి సమస్య లేకుండా చూస్తామన్నారు. కనేకల్లు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌ నుంచి రాయదుర్గం వరకు సుమారు 16.5 కిలోమీటర్ల మేర తాగునీటి పైప్‌లైన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, మరో ఆరు కిలోమీటర్ల మేర పైప్‌లైన్ పనులు కూడా చేపడతామన్నారు. పట్టణంలోని నాలుగు ప్రాంతాల్లో ఓవర్‌ హెడ్ ట్యాంకులు నిర్మించడంతో పాటు, 76 కిలోమీటర్ల మేర సరఫరా పైప్‌లైన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

తద్వారా 6,200 కొత్త కుళాయి కనెక్షన్లు ఇవ్వనున్నామని చెప్పారు. పట్టణ పరిధితో పాటు శివారు ప్రాంతాలకు కూడా అమృత్-2 పథకాన్ని విస్తరిస్తామని తెలిపారు. రాబోయే మూడు దశాబ్దాల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును రూపొందించినట్లు పేర్కొన్నారు. గత ఎన్నికల్లో రాయదుర్గం పట్టణ ప్రజలు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టి 16 వేలకుపైగా మెజారిటీతో తనను గెలిపించారని గుర్తుచేశారు. ప్రజలు అందించిన బలంతో గత రెండేళ్లలో పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలిచి సహకరించాలని ఎమ్మెల్యే కాలవ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బండి కృష్ణ మూర్తి, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ పోరాళ్ల పురుషోత్తం, మాజీ చేనేత డైరెక్టర్ టoకశాల హనుమంతు, అధికార ప్రతినిధి పసుపులేటి నాగరాజు, బంగి శంకర్,మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ గాజుల వెంకటేశులు,సెంట్రల్ స్టోర్ అధ్యక్షుడు పూజరి శివ, కొండాపురం శ్రీనివాసులు, ఆనంద్, మల్లికార్జున,పైతోట అంజి తదితరులు పాల్గొన్నారు.

M. MITHRAM, ANANTAPURURAM

M. MITHRAM, ANANTAPURURAM