Anantapur: అనంతపురంలో రూ.750 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం ఎమ్మెల్యే!

Anantapur: అనంతపురంలో రూ.750 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్ట్. ప్రచారంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రకటన, కూటమి మేయర్ అభ్యర్థి అజేష్ యాదవ్‌కు మద్దతు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 24 Oct 2026 2:50 PM IST
Anantapur
X

Anantapur: అనంతపురంలో రూ.750 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం ఎమ్మెల్యే!

Anantapur: అనంతపురం నగర ప్రజల దశాబ్దాల కల అయిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాన్ని సాకారం చేస్తామని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హామీ ఇచ్చారు. రూ.750 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు వెల్లడించారు. నగరంలో కూటమి మేయర్ అభ్యర్థి అజేష్ యాదవ్‌తో పాటు కూటమి కార్పొరేటర్ అభ్యర్థులు గెలిస్తే అభివృద్ధి పనులు మరింత వేగంగా ముందుకు సాగుతాయని పేర్కొన్నారు.అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది.ఇందులో భాగంగా శనివారం ఉదయం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పలు డివిజన్లలో విస్తృతంగా పర్యటించారు.నవోదయ కాలనీ పరిధిలోని 25, 27, 28, 29వ డివిజన్లతో పాటు 26వ డివిజన్, బుడ్డప్ప నగర్‌లోని రాజేంద్ర మున్సిపల్ హైస్కూల్ సర్కిల్, మరువకొమ్మ కాలనీ, 23వ డివిజన్‌లోని పవర్ ఆఫీస్, వాల్మీకి విగ్రహం పరిసర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు.కూటమి అభ్యర్థులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు.వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రచారం కొనసాగించారు. పలు ప్రాంతాల్లో మహిళలు, వృద్ధులు, యువత ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. తమ కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ సమస్యలు పరిష్కారమవుతున్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేసారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నగర అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోట్లాది రూపాయలతో రోడ్లు, డ్రైనేజీ పనులు చేపట్టినట్లు తెలిపారు.అనంతపురం నగర అభివృద్ధి, సంక్షేమం కోసం రూ.1,400 కోట్ల నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు.నగరంలో గత 20 నుంచి 30 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరిస్తున్నామని, రాబోయే రెండున్నరేళ్లలో మిగిలిన అభివృద్ధి పనులను పూర్తి చేసి ఆధునిక పార్కులు, ఇతర ప్రజా సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.ముఖ్యంగా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీపై కీలక ప్రకటన చేశారు. నగర ప్రజల చిరకాల స్వప్నమైన ఈ ప్రాజెక్టు కోసం రూ.750 కోట్లతో డీపీఆర్ సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. కేంద్రం సహకారంతో ఏడాది కాలంలోనే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లి పూర్తి చేసేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మెగా డీఎస్సీ, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, స్త్రీ శక్తి వంటి పథకాల అమలును వివరించారు.

అనంతపురం నగరంలో అభివృద్ధి పనులు మరింత వేగంగా కొనసాగాలంటే కూటమి మేయర్ అభ్యర్థి అజేష్ యాదవ్‌తో పాటు కార్పొరేటర్ అభ్యర్థులకు ప్రజలు మద్దతు ఇవ్వాలని దగ్గుపాటి ప్రసాద్ కోరారు.అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం, పెండింగ్ పనుల పూర్తి, నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్పష్టం చేశారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM