Kalyandurgam: ఘనంగా 'అమిలినేని విద్యాచక్రం' కార్యక్రమం ప్రారంభం!

Kalyandurgam: కళ్యాణదుర్గంలో ఘనంగా 'అమిలినేని విద్యాచక్రం' కార్యక్రమం. విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు.

P.Sudhakar, Kalyanadurgam
Published on: 28 Sept 2026 4:34 PM IST
Kalyandurgam
X

Kalyandurgam: ఘనంగా 'అమిలినేని విద్యాచక్రం' కార్యక్రమం ప్రారంభం!

Kalyandurgam: కళ్యాణదుర్గంలో ‘అమిలినేని విద్యాచక్రం’ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. విద్యార్థుల చదువుకు ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం పట్టణంలో ఒకేరోజు సుమారు 1500 మంది విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. కరణం చిక్కప్ప క్రీడా ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, టీడీపీ నాయకులు, ఎస్సార్సీ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

నియోజకవర్గ వ్యాప్తంగా 7,300 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు తెలిపారు. 9, 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులకు సైకిళ్లను అందిస్తున్నామని చెప్పారు. ఎస్సార్సీ ట్రస్ట్, సంస్థ సిబ్బంది సహకారంతో సుమారు రూ.5 కోట్ల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. నారా లోకేష్ స్ఫూర్తితో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ‘అమిలినేని విద్యాచక్రం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

సైకిళ్లు అందుకోవడంతో విద్యార్థుల్లో ఆనందం వ్యక్తమైంది. పిల్లలకు సైకిళ్లు అందుతున్న దృశ్యాలను చూసిన తల్లిదండ్రుల్లో కూడా తమ పిల్లలకు మంచి విద్య అందించాలనే ఆకాంక్ష పెరుగుతోందని ఎమ్మెల్యే తెలిపారు. పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలనే ఆలోచన తల్లిదండ్రుల్లో రావడం సంతోషంగా ఉందన్నారు.

విద్యార్థుల విన్నపం మేరకు కళ్యాణదుర్గంలోని ఎస్వీజీఎం డిగ్రీ కళాశాలలో చదువుతున్న 500 మంది విద్యార్థులకు కూడా త్వరలో సైకిళ్లు అందిస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు. విద్యార్థుల విద్యాభివృద్ధితో పాటు ప్రాంత అభివృద్ధికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.

అభివృద్ధి అంశాలపై కూడా ఎమ్మెల్యే మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో బీటీపీ ప్రాజెక్టు ఆలస్యమైందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రాజెక్టు పూర్తికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని తెలిపారు. 2028 మార్చి నాటికి బీటీపీ ప్రాజెక్టును పూర్తి చేసి నీటిని అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు.

కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం వంటి అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. రాబోయే రెండేళ్లలో మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేసి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చెప్పారు.

కార్యక్రమంలో ఎస్సార్సీ చైర్మన్ ముత్తినేని రాజగోపాల్, దేవినేని వెంకటేష్, మహీధర్ రెడ్డి, ఎస్సార్సీ ఎండీ అమిలినేని యశ్వంత్, రాహుల్ ఆదిత్య, దేవినేని అవినాష్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, టీడీపీ నాయకులు, ఎస్సార్సీ ప్రతినిధుల హాజరుతో కరణం చిక్కప్ప క్రీడా ప్రాంగణం సందడిగా మారింది.

P.Sudhakar, Kalyanadurgam

P.Sudhakar, Kalyanadurgam