Anantapur: అనంతపురంలో కూటమి ఎన్నికల ప్రచార హోరు

Anantapur: అనంతపురం మున్సిపల్ ఎన్నికల తుది రోజు ప్రచారంలో బీజేపీ మేయర్ అభ్యర్థి అజేష్ బాబుకు మద్దతుగా కేంద్ర, రాష్ట్ర మంత్రులు, సినీ ప్రముఖులు భారీ ర్యాలీ చేపట్టారు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 30 Oct 2026 4:10 PM IST
Anantapur
X

Anantapur: అనంతపురంలో కూటమి ఎన్నికల ప్రచార హోరు

అనంతపురం: అనంతపురం నగరంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం తుది రోజు హోరెత్తింది. కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా మూడు పార్టీలకు చెందిన హేమాహేమీలు రంగంలోకి దిగడంతో నగరంలో ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరింది. కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు ఎంపీ, ఎమ్మెల్యే, సినీ ప్రముఖులు ప్రచారంలో పాల్గొని ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

కేంద్ర సహాయ మంత్రి తోఖన్ సాహు, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, పీవీఎన్ మాధవ్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ప్రముఖ నటుడు బాబు మోహన్ ప్రచారంలో పాల్గొన్నారు. టవర్ క్లాక్ నుంచి గాంధీ బజార్ వరకు వందలాది బైక్‌లతో భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో నగర ప్రధాన రహదారులన్నీ జనసందోహంతో కిక్కిరిసిపోయాయి.

అనంతరం తాడిపత్రి బస్టాండ్, గాంధీ సర్కిల్ వద్ద నిర్వహించిన బహిరంగ సభకు కూటమి మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు.ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి తోఖన్ సాహు మాట్లాడుతూ.. బీజేపీ మేయర్ అభ్యర్థి కె. అజేష్ బాబు ఇచ్చే ప్రతి హామీ అమలుకు ప్రధాని మోదీ ప్రతినిధిగా తాను పూర్తి బాధ్యత తీసుకుంటానని స్పష్టం చేశారు.

16వ ఆర్థిక సంఘం నిధులతో పాటు అనంతపురం ప్రజల దశాబ్దాల కల అయిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టును మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. నగరాన్ని డంపింగ్ యార్డ్ సమస్య నుంచి శాశ్వతంగా విముక్తి చేస్తామని భరోసా కల్పించారు.మరోవైపు సినీ నటుడు బాబు మోహన్ మాట్లాడుతూ.. ఓటును వృథా చేసుకోవద్దని, నగర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ.. గత రెండున్నరేళ్ల కూటమి పాలనలో అనంతపురం నగరంలో సుమారు 350 కోట్ల రూపాయలతో మౌలిక వసతుల అభివృద్ధి చేపట్టామని వివరించారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 107 కోట్ల రూపాయలతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని తెలిపారు.బీజేపీ మేయర్ అభ్యర్థి అజేష్ బాబు విజయం సాధిస్తే ఢిల్లీ చూపు అనంతపురం వైపు మళ్లుతుందని పేర్కొన్నారు.

నగరంలో అనంతసాగర్ ట్యాంక్‌బండ్ నిర్మాణం, ప్రతి ఇంటికీ గ్యాస్ పైప్‌లైన్ సౌకర్యం, వంకలకు సైడ్‌వాల్స్ నిర్మాణం, మహిళల కోసం ప్రత్యేక పింక్ టాయిలెట్ల ఏర్పాటు వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.మొత్తంగా ఎన్నికల ప్రచారం చివరి రోజు కూటమి నేతల భారీ రోడ్ షోలు, బహిరంగ సభలు, అభివృద్ధి హామీలతో అనంతపురం నగరం రాజకీయ సందడితో మార్మోగింది.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM