Kalyandurgam: రాజ్యాంగ వ్యవస్థలపై దాడి జరుగుతోంది - రఘువీరారెడ్డి

Kalyandurgam: కేంద్రంలో ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థలపై దాడి జరుగుతోందని కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి ఆరోపించారు. ఈవీఎంలు, ఓటర్ల తొలగింపుపై విమర్శలు.

P.Sudhakar, Kalyanadurgam
Published on: 7 Oct 2026 10:18 PM IST
Kalyandurgam
X

Kalyandurgam: రాజ్యాంగ వ్యవస్థలపై దాడి జరుగుతోంది - రఘువీరారెడ్డి

కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రఘువీరారెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడుతున్నాయని ఆరోపించారు. ఎన్నికల వ్యవస్థ, న్యాయ వ్యవస్థలపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. బుధవారం కళ్యాణదుర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ఆర్టీసీ బస్టాండ్ నుంచి గాంధీ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. ‘‘కేంద్రంలో నకిలీ ప్రభుత్వం ఉంది. ఇది 420 ప్రభుత్వం. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం లేదు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో ప్రతిపక్ష సభ్యులను బయటకు పంపి కీలక చట్టాలను ఆమోదించారని, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.

ఎన్నికల సంఘం స్వతంత్రంగా పనిచేయాలి

ఎన్నికల సంఘం పూర్తిగా స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా పనిచేయాలని రఘువీరారెడ్డి అన్నారు. ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన చట్టం విషయంలోనూ ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌పై పలు ఆరోపణలు ప్రస్తావించిన ఆయన.. ఎన్నికల సంఘం వంటి కీలక రాజ్యాంగ సంస్థపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉండేలా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.

ఓటర్ల జాబితా సవరణలో పెద్ద సంఖ్యలో పేర్లు తొలగిస్తున్నారంటూ రఘువీరారెడ్డి ఆరోపించారు. దేశంలో 13 కోట్ల మంది ఓట్లు తొలగించారని, రాష్ట్రంలో 44 లక్షల ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందని అన్నారు. నియోజకవర్గాల వారీగా ఓటర్ల తొలగింపునకు కారణాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.

ఈవీఎంలపై కాంగ్రెస్‌కు అనుమానాలు

ఈవీఎంలపై కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ అనుమానాలు వ్యక్తం చేస్తోందని రఘువీరారెడ్డి తెలిపారు. ఈవీఎంలపై ఉన్న సందేహాలను నివృత్తి చేయాలని కోరినా తమ ప్రశ్నలకు సమాధానాలు రాలేదని అన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సి ఉన్నప్పటికీ 80 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేశారని ఆరోపించారు.

ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ అవసరం

దేశ భవిష్యత్తు, లౌకికవాదం, దేశ భద్రత, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ అవసరమని రఘువీరారెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య, న్యాయ, ఎన్నికల వ్యవస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ కార్యకర్తలు నిరుత్సాహపడకుండా ఐక్యంగా పనిచేయాలని, పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ రాంభూపాల్ రెడ్డి, నాయకులు దాదా గాంధీ, నాగరాజు, సాదిక్ వలి, సీపీఐ నాయకుడు సంజీవప్ప తదితరులు పాల్గొన్నారు.

P.Sudhakar, Kalyanadurgam

P.Sudhakar, Kalyanadurgam