Kalyandurgam: కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో కొలువుదీరిన నూతన పాలకవర్గం

Kalyandurgam: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్‌గా బుట్నా లక్ష్మీ తిమ్మరాజు, వైస్ చైర్మన్‌గా చింతపండు వెంకట కార్తీక్, 32 మంది కౌన్సిలర్ల ప్రమాణం.

P.Sudhakar, Kalyanadurgam
Published on: 23 Nov 2026 5:52 PM IST
Kalyandurgam
X

Kalyandurgam: కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో కొలువుదీరిన నూతన పాలకవర్గం

కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో నూతన పాలకవర్గం అధికారికంగా బాధ్యతలు చేపట్టింది. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్‌గా బుట్నా లక్ష్మీ తిమ్మరాజు, వైస్ చైర్మన్‌గా చింతపండు వెంకట కార్తీక్ ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు మున్సిపాలిటీలోని మొత్తం 32 వార్డులకు చెందిన కౌన్సిలర్లు కూడా ప్రమాణం చేశారు.

ఆర్డీఓ వసంత్ బాబు చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు కౌన్సిలర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. 28 మంది కూటమి కౌన్సిలర్ల మద్దతుతో వైస్ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ముఖ్య అతిథిగా, ఎక్స్ అఫీషియో సభ్యుడి హోదాలో హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు ఎమ్మెల్యేను గజమాలతో ఘనంగా సన్మానించారు.

అనంతరం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో కళ్యాణదుర్గం మున్సిపాలిటీ అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. గత పాలకులు మున్సిపాలిటీని తమ ఆధీనంలో ఉంచుకుని పాలన సాగించారని, అభివృద్ధి పనులకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపించారు. ప్రజలు కూటమిపై నమ్మకంతో అఖండ మెజారిటీ అందించారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే బాధ్యత నూతన పాలకవర్గంపై ఉందన్నారు.

మొత్తం 32 మంది కౌన్సిలర్లు తమ తమ వార్డుల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల నుంచి మద్దతు లభిస్తోందని పేర్కొన్నారు.

కళ్యాణదుర్గం పట్టణ అభివృద్ధికి సంబంధించి పలు హామీలను ఎమ్మెల్యే ప్రకటించారు. రెండేళ్లలో మున్సిపల్ కాంప్లెక్స్‌తో పాటు నూతన మున్సిపల్ కార్యాలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. నగరవనాన్ని మరింత అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. బీటీపీ పనులను వేగవంతం చేసి 2028 మార్చి నాటికి నీటిని తీసుకువచ్చి 114 చెరువులకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని వెల్లడించారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల సమన్వయంతో పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

P.Sudhakar, Kalyanadurgam

P.Sudhakar, Kalyanadurgam