Kalyandurg: వేపలపర్తిలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు రోడ్ షో
Kalyandurg: బ్రహ్మసముద్రం మండలం వేపలపర్తిలో కూటమి జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే సురేంద్రబాబు రోడ్ షో. 2028 నాటికి బీటీపీ పూర్తి చేస్తామని హామీ.
Kalyandurg: వేపలపర్తిలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు రోడ్ షో
కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం బ్రహ్మసముద్రం మండలం వేపలపర్తిలో కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం సందడిగా సాగింది. జడ్పీటీసీ అభ్యర్థి పాలబండ్ల శ్రీరాములు, ఎంపీటీసీ అభ్యర్థులకు మద్దతుగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గ్రామంలో రోడ్ షో నిర్వహించారు. రంగనాథ స్వామి ఆలయం వద్ద ప్రారంభమైన ప్రచార కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గ్రామంలో పలుచోట్ల ఎమ్మెల్యేకు పూలవర్షంతో స్వాగతం పలికారు.
రోడ్ షో సందర్భంగా నిర్వహించిన ప్రచారంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు వైసీపీ నాయకులపై విమర్శలు చేశారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో వైసీపీ సమన్వయకర్త తలారి రంగయ్య ఓటమి భయంతో ఇంటికే పరిమితమయ్యారని వ్యాఖ్యానించారు. వైసీపీ నాయకులు కులాల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రజలు అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు.
కళ్యాణదుర్గం ప్రాంతానికి కృష్ణా జలాలను తీసుకురావడానికి తన సంస్థ తరఫున సుమారు రూ.9 నుంచి రూ.10 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. బీటీపీ ప్రాజెక్టు పనులను 2028 మార్చి నాటికి పూర్తి చేసి సాగునీరు అందిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి ప్రకటించిన ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకారం పనులు ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని 140 చెరువులను నీటితో నింపి భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యమని చెప్పారు. ఈ ప్రాంతాన్ని గోదావరి ప్రాంతాన్ని తలపించేలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
వేపలపర్తి గ్రామ అభివృద్ధికి సంబంధించి కూడా ఎమ్మెల్యే పలు హామీలు ఇచ్చారు. తన సొంత నిధులతో రూ.50 లక్షల వ్యయంతో గ్రామంలో కళ్యాణమంటపం నిర్మిస్తానని ప్రకటించారు. విద్యార్థులు పుస్తకాల సంచుల బరువుతో ఇబ్బందులు పడుతూ పాఠశాలలకు వెళ్తున్న పరిస్థితిని గమనించి తమ సంస్థ ద్వారా 9, 10 తరగతులతో పాటు ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు 7,500 సైకిళ్లు అందించే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు.
రైతులకు సాగునీరు, గ్రామాలకు మౌలిక వసతులు, విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించడమే తమ ప్రాధాన్యతలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎన్నికల్లో కూటమి జడ్పీటీసీ అభ్యర్థి పాలబండ్ల శ్రీరాములుతో పాటు ఎంపీటీసీ అభ్యర్థులను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీల అభివృద్ధికి కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.




