Kalyandurg: కరణం చిక్కప్ప పాఠశాలను సందర్శించిన డీఈఓ
Kalyandurg: కళ్యాణదుర్గం కరణం చిక్కప్ప పాఠశాలను డీఈఓ అయ్యూబ్ హుస్సేన్ సందర్శించి, మిషన్ మార్చ్ అమలును, విద్యార్థుల విద్యా ప్రమాణాలను పరిశీలించారు.
Kalyandurg: కరణం చిక్కప్ప పాఠశాలను సందర్శించిన డీఈఓ
కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గంలోని కరణం చిక్కప్ప ప్రభుత్వ ఉన్నత పాఠశాలను అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్. అయ్యూబ్ హుస్సేన్ గురువారం సందర్శించారు. పాఠశాలలో విద్యార్థుల విద్యా ప్రమాణాలు,పదో తరగతి ఫలితాల మెరుగుదల,కెరీర్ గైడెన్స్,100 రోజుల మిషన్ మార్చ్ కార్యక్రమం అమలును పరిశీలించారు.
పదో తరగతి అనంతరం విద్యార్థులు తమ లక్ష్యాలను ఇప్పటి నుంచే నిర్దేశించుకుని,ఉపాధ్యాయుల సూచనలతో ముందుకు సాగాలని డీఈఓ సూచించారు. ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తితో కలలు కని,క్రమశిక్షణ, పట్టుదలతో వాటిని సాధించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నందుకు విద్యార్థులు గర్వపడాలని, మార్కుల విషయంలో తోటి విద్యార్థులతో పోల్చుకోవద్దని సూచించారు. గాంధీ, నెహ్రూ, ఏపీజే అబ్దుల్ కలాం వంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకోవాలని,తల్లిదండ్రులు,ఉపాధ్యాయులను గౌరవించాలని తెలిపారు.
పదో తరగతిలో ఎవరూ ఫెయిల్ కాకుండా 100 రోజుల మిషన్ మార్చ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమాన్ని ఫొటోల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.
అనంతరం విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని డీఈఓ రుచి చూసి నాణ్యత,పరిశుభ్రతను పరిశీలించారు. నా విద్యార్థులు–నా టీచర్లు అనే స్ఫూర్తితో ప్రతి విద్యార్థి ప్రగతికి కృషి చేయాలని డీఈఓ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంఈఓతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గంధం శ్రీనివాసులు పాల్గొన్నారు.




