Kalyandurg: కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలి
Kalyandurg: కళ్యాణదుర్గంలో కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో కరువు దీక్షలు. రైతులు, కూలీలకు ప్రత్యేక సహాయం అందించాలని డిమాండ్.
Kalyandurg: కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలి
కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నెలకొన్న కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని, కరువును జాతీయ విపత్తుగా గుర్తించి ప్రత్యేక సహాయక చర్యలు చేపట్టాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి గోపాల్ డిమాండ్ చేశారు. చిన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలకు కరువు పెన్షన్ అందించాలని కోరారు.
సోమవారం కళ్యాణదుర్గం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో కరువు దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి గోపాల్, పట్టణ కార్యదర్శి ఓంకార్ మాట్లాడుతూ.. కరువు తీవ్రతను అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రైతులు, వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే గుర్తించి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
కరువును జాతీయ విపత్తుగా ప్రకటించడంతో పాటు రైతుల బ్యాంకు రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని, పశువులకు మేత కొరత లేకుండా పశుగ్రాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించి, పంటల బీమా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.అలాగే విద్యార్థుల ఫీజులను పూర్తిగా మాఫీ చేయాలని, వ్యవసాయ కూలీలకు ఎలాంటి షరతులు లేకుండా ఉపాధి హామీ పనులు కల్పించాలని కోరారు.
అన్ని గ్రామాలకు ఉచితంగా తాగునీటిని సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కరువు పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు సమస్యలను పట్టించుకోకపోవడం బాధాకరమని సీపీఐ నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కరువు నివారణ చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ కరువు దీక్షలో కళ్యాణదుర్గం రూరల్ మండల సహాయ కార్యదర్శులు వెంకటేశులు, శ్రీనివాస్ నాయక్, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మీదేవి, నియోజకవర్గ కమిటీ సభ్యురాలు రాయక్క, ఏఐఎస్ఎఫ్ తాలూకా నాయకుడు నవీన్‌తో పాటు తిమ్మప్ప, నరసింహులు, బ్రిజేష్, అనిత, ముత్యాలమ్మ తదితరులు పాల్గొన్నారు.




