Kadiri: వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఘనంగా కిసాన్ మేళా
Kadiri: కదిరి వ్యవసాయ పరిశోధన కేంద్రంలో నిర్వహించిన కిసాన్ మేళాలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పాల్గొని, నూతన వ్యవసాయ పద్ధతులపై సూచనలు చేశారు.
Kadiri: వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఘనంగా కిసాన్ మేళా
కదిరి: సత్యసాయి జిల్లా కదిరి వ్యవసాయ పరిశోధన కేంద్రంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో, వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ATMA) నిర్వహించిన కిసాన్ మేళా కార్యక్రమంలో కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వ్యవసాయ పరిశోధన స్థానంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్, ఎగ్జిబిషన్ కేంద్రాలను ఎమ్మెల్యే పరిశీలించారు. రైతులకు అందుబాటులో ఉన్న నూతన వంగడాలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటల సంరక్షణ విధానాలు, వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాలను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కిసాన్ మేళాలు రైతులకు ఎంతో ఉపయోగకరమని
రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతికతను చేరువ చేయడంతో పాటు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు, అధికారుల నుంచి నేరుగా సలహాలు, సూచనలు పొందేందుకు కిసాన్ మేళాలు మంచి వేదికలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతులు ఇటువంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలని సూచించారు.
ఎల్ నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు, వర్షపాతం లోటు, అధిక ఉష్ణోగ్రతలు వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు నష్టపోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుగానే అధికారులతో సమీక్షలు నిర్వహించి, అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు రైతులకు అవగాహన కల్పించేలా ఆదేశాలు ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.
ఎల్ నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల ఎంపిక, విత్తనాల వినియోగం, నీటి పొదుపు, నేలలో తేమను కాపాడుకోవడం, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక వంటి అంశాల్లో వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలని ఎమ్మెల్యే సూచించారు.




