Kadiri: కదిరి బీడీ కార్మికుల సమస్యలపై నిసార్ యాసీన్ ఖాన్ ప్రత్యేక చొరవ!
Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతంలోని 10,000 మంది బీడీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిసార్ యాసీన్ ప్రజా సేవా నెట్వర్క్ వ్యవస్థాపకులు బి. నిసార్ యాసీన్ ఖాన్ ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పించారు.
Kadiri: కదిరి బీడీ కార్మికుల సమస్యలపై నిసార్ యాసీన్ ఖాన్ ప్రత్యేక చొరవ!
కదిరి: సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతంలో బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న సుమారు 10,000 మంది కార్మికులు, ముఖ్యంగా మహిళా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిసార్ యాసీన్ ప్రజా సేవా నెట్వర్క్ (NYPSN) వ్యవస్థాపకులు B. నిసార్ యాసీన్ ఖాన్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
ఈ సమస్యలను ప్రభుత్వ స్థాయిలో పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వంలోని రెండు కీలక శాఖల ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించారు.
కార్మిక శాఖ (LABOUR DEPARTMENT)
కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ఎం.వి. శేషాద్రి బాబు గారిని కలిసి కదిరి ప్రాంత బీడీ కార్మికుల సమస్యలను వివరించి వినతిపత్రం సమర్పించారు. ప్రతి 1,000 బీడీల తయారీపై అదనంగా రూ.50 కూలీ పెంపు, గుర్తింపు కార్డులు, కనీస వేతనాల అమలు, కార్మిక సంక్షేమ పథకాలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ అంశాలపై ఎం.వి. శేషాద్రి బాబు గారు సానుకూలంగా స్పందిస్తూ కార్మికులకు న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మైనారిటీ సంక్షేమ శాఖ (MINORITY WELFARE DEPARTMENT)
మైనారిటీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ చి. శ్రీధర్, IAS గారిని కూడా కలిసి కదిరి ప్రాంతంలోని పేద మైనారిటీ మహిళా బీడీ కార్మికుల ఆర్థిక, సామాజిక సమస్యలను వివరించారు. ఈ సమస్యపై మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేకంగా జోక్యం చేసుకుని కార్మిక శాఖతో సమన్వయం ద్వారా పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
నిసార్ యాసీన్ ఖాన్ ప్రధాన డిమాండ్లు
ప్రతి 1,000 బీడీల తయారీపై అదనంగా రూ.50 కూలీ పెంపు. అర్హులైన కార్మికులందరికీ గుర్తింపు కార్డులు. కనీస వేతనాల అమలుపై సమగ్ర పరిశీలన. అర్హులైన కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు. మహిళా కార్మికులకు ఆర్థిక, సామాజిక భద్రత.
ఈ సందర్భంగా నిసార్ యాసీన్ ఖాన్ మాట్లాడుతూ, "కదిరిలో వేలాది మంది మహిళలు బీడీలు చుట్టడమే జీవనోపాధిగా చేసుకుని కుటుంబాలను పోషిస్తున్నారు. వారి కష్టానికి తగిన ప్రతిఫలం, న్యాయమైన కూలీ, ప్రభుత్వ సంక్షేమం అందాలి. కదిరి బీడీ కార్మికుల సమస్యలకు పరిష్కారం లభించే వరకు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్తూ మా ప్రయత్నాలు కొనసాగిస్తాం" అని తెలిపారు. కదిరి బీడీ కార్మికుల హక్కుల కోసం నిసార్ యాసీన్ ఖాన్ ఆధ్వర్యంలో NYPSN నిరంతర కృషి చేస్తోందన్నారు.




