Kothacheruvu: కొత్తచెరువులో జెడ్పీటీసీ ఎన్నికల సందడి: పోటాపోటీ నామినేషన్లు
Kothacheruvu: శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువులో జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల దాఖలు జోరుగా సాగింది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు 25 మంది నామినేషన్లు వేశారు.
Kothacheruvu: కొత్తచెరువులో జెడ్పీటీసీ ఎన్నికల సందడి: పోటాపోటీ నామినేషన్లు
శ్రీ సత్యసాయి జిల్లా: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని కొత్తచెరువు జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగుతోంది. జడ్పిటిసి ఎన్నికల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేసేందుకు ఉత్సాహంగా తరలివచ్చారు. దీంతో నామినేషన్ కేంద్రం వద్ద రాజకీయ సందడి నెలకొంది.
నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేలా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్ కేంద్రంలోకి ప్రవేశించే అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం, ఒక్కో అభ్యర్థి వెంట ఇద్దరిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున చిలకం మధుసూదన్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున వజ్ర భాస్కర్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ తరఫున ఆదినారాయణ యాదవ్ నామినేషన్లు దాఖలు చేశారు .కాంగ్రెస్ పార్టీ తరపున ఆ పార్టీ అభ్యర్థి రోళ్ళ లక్ష్మి వెంట కాంగ్రెస్ పార్టీ మీడియా కోఆర్డినేటర్ తులసిరెడ్డి హాజరయ్యారు.
మధ్యాహ్నం సమయానికి సుమారు 25 మంది దాకా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు సమాచారం. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుండటంతో ఎన్నికల కేంద్రం వద్ద రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తల సందడి కనిపించింది.




