Guntakal: అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరిస్తాం!
Guntakal: అనంతపురం జిల్లా గుంతకల్లులో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో డీఎస్పీ బి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 180 మంది పోలీసులతో విస్తృత తనిఖీలు మరియు అసాంఘిక శక్తులపై హెచ్చరికలు.
Guntakal: అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరిస్తాం!
Guntakal: పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని గుంతకల్లు డీఎస్పీ బి. శ్రీనివాసరావు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ జగదీష్, ఐపీఎస్ ఆదేశాల మేరకు గురువారం గుంతకల్లు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 180 మంది పోలీస్ సిబ్బందితో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
గంగానగర్, షికారి కాలనీ, బెంచికొట్టాల, రైల్వే స్టేషన్, కసాపురం ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామం, గుంతకల్లు–ధోనిముక్కల రోడ్డు ప్రాంతాల్లో రౌడీషీటర్ల ఇళ్లు, అనుమానితుల ఇళ్లు, అనుమానాస్పద ప్రాంతాల్లో పోలీసులు క్షుణ్ణంగా సోదాలు చేపట్టారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రౌడీషీటర్లు, ఇతర అసాంఘిక శక్తులు సత్ప్రవర్తనతో మెలగాలని డీఎస్పీ సూచించారు. నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే రౌడీషీట్లు తెరిచి నిరంతరం నిఘా ఉంచుతామని తెలిపారు. ఇప్పటికే పలు నేరాల్లో ఉన్నవారు తమ ప్రవర్తన మార్చుకోకుండా తిరిగి నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్ ప్రయోగించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అక్రమ ఆయుధాలు, వాహనాలు కలిగి ఉన్న వారిపై ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు. పట్టణంలో గంజాయి విక్రయాలు, మట్కా, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. పార్టీల మధ్య లేదా కమ్యూనిటీల మధ్య సమస్యలు సృష్టించే వారిని గుర్తించి వారిపై సస్పెక్ట్ షీట్లు తెరిచి నిఘా ఉంచుతామని పేర్కొన్నారు.
జిల్లాలో తరచూ జరుగుతున్న దొంగతనాలు, చైన్ స్నాచింగ్, సైబర్ నేరాలపై మహిళలు, వృద్ధులకు పోలీసులు అవగాహన కల్పించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ అంకితభావంతో, సేవా దృక్పథంతో పనిచేసి పోలీసు శాఖ ప్రతిష్టను మరింత పెంచుతామని డీఎస్పీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో గుంతకల్లు వన్‌టౌన్ ఎస్సై కళ్యాణ్, టూటౌన్ ఎస్సై సురేష్, రూరల్ ఎస్సై బాలముని, కసాపురం ఎస్సై వెంకటస్వామి, 180 మంది ప్రొబేషనరీ కానిస్టేబుళ్లు, స్థానిక పోలీసు సిబ్బంది, మహిళా పోలీసులు పాల్గొన్నారు.




