Guntakal: అనంతపురం జెడ్పీ చైర్మన్ రేసులో గొంది వెంకటశివుడు యాదవ్!
Guntakal: అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్ రేసులో టీడీపీ నాయకుడు గొంది వెంకటశివుడు యాదవ్. పామిడి జడ్పీటీసీ స్థానానికి భార్యాభర్తల నామినేషన్లు!
Guntakal: అనంతపురం జెడ్పీ చైర్మన్ రేసులో గొంది వెంకటశివుడు యాదవ్!
గుంతకల్లు: అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకుడు గొంది వెంకటశివుడు యాదవ్ పేరు తెరపైకి వచ్చింది. గుంతకల్లు నియోజకవర్గానికి చెందిన ఆయన పామిడి మండలం జడ్పీటీసీ స్థానానికి బరిలో నిలిచారు. ఆయనతో పాటు ఆయన భార్య గొంది భారతి కూడా అదే జడ్పీటీసీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు.
తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ ఆశించిన వెంకటశివుడు యాదవ్‌కు చివరి నిమిషంలో అవకాశం దక్కకపోయినా, పార్టీకి తనవంతు సేవలు అందిస్తూ ముందుకు సాగుతున్నారు. ఎన్నికలకు ముందుగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకు పార్టీ జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించారు.
ప్రస్తుతం పామిడి మండలం జడ్పీటీసీ స్థానానికి పోటీ చేస్తున్న వెంకటశివుడు యాదవ్‌కు జిల్లా ఇన్‌చార్జి మంత్రి, జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు, జిల్లా కోఆర్డినేటర్, పార్టీ సీనియర్ నాయకులు, ఎన్నికల పరిశీలకులు, ప్రజాప్రతినిధుల సహకారం లభిస్తోందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి సంబంధించి పార్టీ అధిష్ఠానం చేసే కసరత్తులో వెంకటశివుడు యాదవ్ పేరు పరిశీలనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఒకవేళ చైర్మన్ పదవి మహిళకు కేటాయిస్తే, ఆయన భార్య గొంది భారతికి అవకాశం లభించేలా రాజకీయ సమీకరణాలు ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో గొంది వెంకటశివుడు యాదవ్, ఆయన భార్య గొంది భారతి ఇద్దరూ పామిడి జడ్పీటీసీ స్థానానికి జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేశారు. అయితే జిల్లా పరిషత్ చైర్మన్ పదవిపై పార్టీ అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.




