Tadipatri: గతంలో చేసిన తప్పులకు క్షమించండి: జేసీ ప్రభాకర్ రెడ్డి
Tadipatri: గతంలో జరిగిన ఫ్యాక్షన్ తప్పులకు తనను క్షమించాలని, రాజకీయ గొడవలకు ప్రజలు బలికాకుండా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
Tadipatri: గతంలో చేసిన తప్పులకు క్షమించండి: జేసీ ప్రభాకర్ రెడ్డి
తాడిపత్రి: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఫ్యాక్షన్ రాజకీయాల వల్ల గతంలో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ, ఇకపై ప్రజలు రాజకీయ గొడవల్లో చిక్కుకోకుండా తమ కుటుంబాల భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఫ్యాక్షన్ రాజకీయాల్లో తనకూ బాధ్యత ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి అంగీకరించారు. గతంలో జరిగిన తప్పులకు తనను క్షమించాలని ప్రజలను కోరారు. ఒకప్పుడు తాను మంచివాడిని కాకపోయి ఉండవచ్చని ప్రస్తుతం మాత్రం ప్రజలకు మంచి జరగాలని, ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
గతంలో జరిగిన ఫ్యాక్షన్ గొడవల వల్ల ఎన్నో కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్షన్ రాజకీయాల కారణంగా ప్రజలకు జరిగిన నష్టాన్ని తలుచుకుంటే బాధ కలుగుతోందని పేర్కొన్నారు.రాజకీయ విభేదాలు వ్యక్తిగత శత్రుత్వాలకు దారితీయకూడదని, నాయకుల మధ్య ఉన్న విభేదాల కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకూడదన్నారు.
ముఖ్యంగా ఎల్లనూరు మండల ప్రజలు ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా ఉండాలని, ఎలాంటి ప్రలోభాలకు లేదా రెచ్చగొట్టే వ్యాఖ్యలకు ప్రభావితమై గొడవల్లోకి దిగవద్దని విజ్ఞప్తి చేశారు.కేతిరెడ్డి పెద్దారెడ్డి, భోగాతి నారాయణరెడ్డిని నమ్మవద్దని ఎల్లనూరు ప్రజలకు జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.ఫ్యాక్షన్ గొడవల వల్ల ఇప్పటికే ఎంతో నష్టం జరిగిందని, అలాంటి పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకూడదని అన్నారు.
గొడవల వల్ల ప్రజలు ఏమి సాధిస్తారని ప్రశ్నించారు. గతంలో జరిగిన పరిణామాల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని, ప్రజలు తమ జీవితాలను రాజకీయ వివాదాలకు బలి చేయకూడదని సూచించారు.
నాయకులు రాజకీయంగా పోటీ పడాలనుకుంటే ప్రజాస్వామ్య పద్ధతిలో నేరుగా ఎన్నికల్లో పోటీ చేయాలని వ్యాఖ్యానించారు. ప్రజలను గొడవల్లోకి లాగకుండా, ఎన్నికల ద్వారా ప్రజల మద్దతు పొందాలని సూచించారు.




