Gandlapenta: అప్పుల బాధతో కౌలు రైతు బలవన్మరణం
Gandlapenta: శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపెంట మండలం కటారుపల్లి గొల్లపల్లిలో పంట నష్టం, అప్పుల భారం తాళలేక కౌలు రైతు గజ్జి రామచంద్ర పొలం వద్దే ఆత్మహత్య చేసుకున్నారు.
Gandlapenta: అప్పుల బాధతో కౌలు రైతు బలవన్మరణం
శ్రీ సత్యసాయి జిల్లా, గాండ్లపెంట మండలం: అప్పుల బాధతో ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపెంట మండలం కటారుపల్లి గొల్లపల్లి ఎస్సీ కాలనీలో చోటుచేసుకుంది. వ్యవసాయంపై ఆధారపడి కుటుంబాన్ని పోషిస్తున్న కౌలు రైతు గజ్జి రామచంద్ర పంట సాగు కోసం చేసిన కష్టానికి తగిన ఫలితం దక్కకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైనట్లు సమాచారం.
గజ్జి రామచంద్ర దాదాపు ఐదు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని పంట సాగు చేస్తున్నాడు. అయితే పంట చేతికి అందకపోవడం, వ్యవసాయానికి చేసిన ఖర్చులు, అప్పుల భారం కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం సుమారు 9 గంటల ప్రాంతంలో తన పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన కదిరి ఆసుపత్రికి తరలించినా పలితం లేదు అప్పటికే కౌలు రైతు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న రామచంద్ర మృతితో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి ఉన్నారు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి మృతి చెందడంతో వారి భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది.
కష్టపడి పంట పండించినా ఆశించిన ఫలితం దక్కక, అప్పుల భారం తాళలేక కౌలు రైతు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది. రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, బాధిత కుటుంబానికి తగిన ఆర్థిక సహాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు.




