Gooty: గుత్తి–బళ్లారి జాతీయ రహదారి పనులు వెంటనే పూర్తి చేయాలి!

Gooty: గుత్తి నుంచి బళ్లారి వరకు జాతీయ రహదారి 67 నాలుగు వరుసల పనులను వెంటనే పూర్తి చేయాలని, రహదారి ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలు చేపట్టాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 9 Oct 2026 1:44 PM IST
Gooty
X

Gooty: గుత్తి–బళ్లారి జాతీయ రహదారి పనులు వెంటనే పూర్తి చేయాలి!

Gooty: గుత్తి నుంచి బళ్లారి వరకు జాతీయ రహదారి 67 నాలుగు వరుసల రహదారి పనులను వెంటనే పూర్తి చేయాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. రహదారి పనుల్లో జాప్యం, గుంతలు, సరైన హెచ్చరిక బోర్డులు లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ గుత్తి పట్టణంలో సీపీఐ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా గుంతకల్లు పట్టణంలోని బీరప్ప సర్కిల్ వద్ద రోడ్డు దిగ్బంధం చేపట్టి, జాతీయ రహదారి పనులను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.

గుత్తిలో జరిగిన నిరసన కార్యక్రమానికి సీపీఐ పట్టణ నాయకులు వెంకటరాముడు అధ్యక్షత వహించగా, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరభద్రస్వామి, రమేష్, పట్టణ కార్యదర్శి రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2018లోనే జాతీయ రహదారి 67 పనులు పూర్తి చేయడంతో పాటు స్పీడ్ బ్రేకర్లు, సిగ్నల్ బోర్డులు తదితర భద్రతా ఏర్పాట్లు చేయాల్సి ఉన్నప్పటికీ, కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యం కారణంగా పనులు నేటికీ పూర్తికాలేదని ఆరోపించారు.

గుత్తి నుంచి బళ్లారి వరకు రహదారిపై గుంతలు, అసంపూర్తి పనుల కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. చిన్నచిన్న ప్రమాదాలు కూడా తరచూ జరుగుతున్నాయని, అయినప్పటికీ సంబంధిత అధికారులు, కేంద్ర ప్రభుత్వం రహదారి పనుల పూర్తిపై తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

గుంతకల్లు పట్టణంలోనూ జాతీయ రహదారి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జగదీష్ డిమాండ్ చేశారు. పట్టణంలోని హనుమాన్ సర్కిల్ వద్ద పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలని కోరారు. ఉదయం వేళల్లో భారీ వాహనాలను పట్టణంలోకి అనుమతించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు. రహదారి పనులు పూర్తికాకపోవడం వల్ల ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు.

అనంతరం గుత్తి ఎమ్మార్వో కార్యాలయ సూపరింటెండెంట్ ఆనంద్‌కు సీపీఐ నాయకులు వినతిపత్రం అందజేశారు. జాతీయ రహదారి 67 నాలుగు వరుసల రహదారి పనులను వెంటనే పూర్తి చేయడంతో పాటు ప్రమాదాల నివారణకు అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శి నజీర్, మహిళా సమాఖ్య నియోజకవర్గ కార్యదర్శి మముదా, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు రామాంజనేయులు, సూరి, రజాక్, రామంజి, మహిళా సంఘాల నాయకులు, ఇతర సీపీఐ కార్యకర్తలు పాల్గొన్నారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL