Kalyandurg: తలారి రంగయ్యపై బుట్టా లక్ష్మి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
Kalyandurg: తనపై శ్రీలంక పౌరురాలినంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని కళ్యాణదుర్గం ఎన్డీఏ టీడీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి బుట్టా లక్ష్మి వైసీపీ నేత తలారి రంగయ్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Kalyandurg: తలారి రంగయ్యపై బుట్టా లక్ష్మి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వివాదం నెలకొంది. తనపై అసత్య ఆరోపణలు చేస్తూ వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారంటూ ఎన్డీఏ కూటమి టీడీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి బుట్టా లక్ష్మి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వైసీపీ సమన్వయకర్త తలారి రంగయ్యపై ఆమె ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఈ నెల 28వ తేదీన తాను శ్రీలంక పౌరురాలినంటూ తలారి రంగయ్య ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారని బుట్టా లక్ష్మి ఆరోపించారు. అంతేకాకుండా ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో తనకు వ్యతిరేకంగా అసత్య ప్రచారం చేస్తూ వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.
1978లో కళ్యాణదుర్గానికి కోడలిగా వచ్చానని, తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని బుట్టా లక్ష్మి తెలిపారు. తన పౌరసత్వాన్ని ప్రభుత్వ అధికారులు గుర్తించి అవసరమైన గుర్తింపు కార్డులు జారీ చేశారని, మున్సిపల్ ఎన్నికల్లో తన నామినేషన్‌ను పరిశీలించి ఆమోదించడంతో పాటు సైకిల్ గుర్తును కేటాయించారని వివరించారు.
ఎన్నికల సమయంలో తన పౌరసత్వంపై వివాదం సృష్టించడం వెనుక రాజకీయ కుట్ర ఉందని, వైసీపీకి ఎన్నికల్లో లబ్ధి చేకూర్చేందుకే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని బుట్టా లక్ష్మి ఆరోపించారు. తనపై జరుగుతున్న అసత్య ప్రచారంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.




