Anantapur: శిల్పారామానికి పూర్వవైభవం తెస్తాం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి

Anantapur: అనంతపురం శిల్పారామానికి పూర్వవైభవం తెస్తామని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి తెలిపారు. డిసెంబర్ 18న భారీ వేడుక నిర్వహిస్తామని ప్రకటించారు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 1 Oct 2026 4:43 PM IST
Anantapur
X

Anantapur: శిల్పారామానికి పూర్వవైభవం తెస్తాం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి

అనంతపూర్: అనంతపురం నగరంలోని శిల్పారామానికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి తెలిపారు.శిల్పారామం వేదికగా గురువారం నిర్వహించిన ‘గ్రాటిట్యూడ్ అండ్ ట్రిబ్యూట్ మీట్’లో ఆయన మాట్లాడారు.

1995 డిసెంబర్ 18న తాను మున్సిపల్ చైర్మన్‌గా ఉన్న సమయంలో నేషనల్ పార్క్ నిర్మాణానికి భూమిపూజ చేశామని ప్రభాకర్ చౌదరి గుర్తు చేశారు.దాతలు, విద్యార్థులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, పాత్రికేయులతో కలిసి శ్రమదానం చేసి నేషనల్ పార్క్‌ను అభివృద్ధి చేశామని తెలిపారు.తన చైర్మన్ పదవీకాలం అనంతరం 72 ఎకరాల పార్క్‌ను కొందరు స్వార్థపరులు ట్రస్టుల పేరుతో అన్యాక్రాంతం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.

దీనిపై తాను హైకోర్టును ఆశ్రయించి అపిల్ దాఖలు చేశానని, అనంతరం పార్క్‌ను ప్రజలకు దక్కేలా చేశామని చెప్పారు.2014లో ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో శిల్పారామం అభివృద్ధికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. అనేక మంది నాయకులు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో నేషనల్ పార్క్‌ను శిల్పారామంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు.

అయితే ప్రస్తుతం నిర్లక్ష్యం కారణంగా శిల్పారామం అభివృద్ధికి దూరమైందని ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఏళ్ల నాటి చెట్లు ఎండిపోతున్నాయని, మ్యూజికల్ ఫౌంటెన్లు పనిచేయడం లేదని అన్నారు.శిల్పారామం అన్యాక్రాంతం అవుతున్న విషయాన్ని జిల్లా కలెక్టర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.నేషనల్ పార్క్, శిల్పారామం అభివృద్ధికి సహకరించిన మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు, దాతలు, శ్రమదానంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

అభివృద్ధికి కృషి చేసి మరణించిన వారికి నివాళులు అర్పిస్తూ, సహకరించిన వారిని సన్మానించే కార్యక్రమాన్ని డిసెంబర్ 18న వేలాది మందితో నిర్వహిస్తామని ప్రకటించారు.అనంతరం ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి శిల్పారామం పరిసరాలను పరిశీలించారు.కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ గంపన్న, మాజీ శ్యాప్ డైరెక్టర్ షకీల్ షఫీ, పలువురు టీడీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే అభిమానులు పాల్గొన్నారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM