Anantapur: అనంతపురాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్ సిటీగా తీర్చిదిద్దుతాం: ఎమ్మెల్యే!
Anantapur: అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన 41 మంది కార్పొరేటర్లు, 9 మంది ఎంపీటీసీలను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, కూటమి నేతలు ఘనంగా సన్మానించారు.
Anantapur: అనంతపురాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్ సిటీగా తీర్చిదిద్దుతాం: ఎమ్మెల్యే!
అనంతపురం: అనంతపురం నగరాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్ సిటీగా అభివృద్ధి చేసి చూపిస్తామని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్పష్టం చేశారు. నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు పనిచేయాలని పిలుపునిచ్చారు.
అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంలో నగరపాలక సంస్థతో పాటు అనంతపురం రూరల్ పరిధిలో కూటమి తరఫున నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దలవాయి రమాదేవి, జనసేన నగర అధ్యక్షుడు బాబురావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్‌తో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు.
నగరపాలక సంస్థలో విజయం సాధించిన 41 మంది కార్పొరేటర్లు, రూరల్ పరిధిలో గెలుపొందిన 9 మంది ఎంపీటీసీలను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రజలు ఎంతో నమ్మకంతో అందించిన విజయాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నూతన ప్రజాప్రతినిధులపై ఉందన్నారు.
41 మంది కార్పొరేటర్లు, 9 మంది ఎంపీటీసీలు నగర, గ్రామాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. మేయర్ అభ్యర్థి ఓటమికి గల కారణాలను సమీక్షించి, ఎక్కడ లోపాలు జరిగాయో గుర్తించి సరిదిద్దుకుంటామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే.. ఐదేళ్లలో మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి నగరంలో ఒక్క కొత్త రోడ్డు, డ్రైనేజీ కూడా నిర్మించలేదని ఆరోపించారు.
టవర్ క్లాక్ రోడ్డు కూడా 2018లో టీడీపీ హయాంలోనే మంజూరైందని పేర్కొన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే ఆయన నగరానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు.అనంతపురం నగరంలోనే రూ.1,400 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు.
రాయలసీమ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, మదనపల్లిలో హార్టికల్చర్ హబ్, పుట్టపర్తిలో డిఫెన్స్ పరిశ్రమల ఏర్పాటుకు భారీ పెట్టుబడులు తీసుకొస్తున్నట్లు తెలిపారు. అనంతపురం జిల్లా రైతులకు రూ.300 కోట్ల సబ్సిడీతో డ్రిప్ సౌకర్యం కల్పించామని, హంద్రీనీవా కాలువ సామర్థ్యాన్ని 1,800 క్యూసెక్కుల నుంచి 3,500 క్యూసెక్కులకు పెంచి సాగునీరు అందిస్తున్నామని వెల్లడించారు.
అనంతరం ఎమ్మెల్సీ రమాదేవి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్, జనసేన నగర అధ్యక్షుడు బాబురావు మాట్లాడుతూ.. ప్రజలు కూటమిపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని నూతన ప్రజాప్రతినిధులకు సూచించారు. ప్రతి వార్డులో మౌలిక వసతుల కల్పనకు, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు.




