Anantapur: అనంతపురం మేయర్ పీఠమే లక్ష్యంగా కూటమి భారీ ర్యాలీ

Anantapur: అనంతపురం కార్పొరేషన్ మేయర్ కూటమి అభ్యర్థిగా బీజేపీ నేత అజేష్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే ప్రసాద్ భారీ ర్యాలీలో పాల్గొన్నారు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 18 Oct 2026 4:10 PM IST
Anantapur
X

Anantapur: అనంతపురం మేయర్ పీఠమే లక్ష్యంగా కూటమి భారీ ర్యాలీ

అనంతపురం: అనంతపురం నగరంలో మేయర్ పీఠమే లక్ష్యంగా కూటమి పార్టీలు ఎన్నికల సమరానికి సిద్ధమయ్యాయి.కూటమి తరఫున బీజేపీ మేయర్ అభ్యర్థి అజేష్ యాదవ్ నామినేషన్ కార్యక్రమం భారీ జనసందోహం, కార్యకర్తల నినాదాలతో హోరెత్తింది.కోర్టు రోడ్డు నుంచి టవర్ క్లాక్ మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌తో పాటు కూటమి పార్టీల ముఖ్య నేతలు పాల్గొన్నారు. కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అభ్యర్థికి మద్దతుగా నిలిచాయి.ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ.. విద్యావంతుడైన అజేష్ యాదవ్ పోరాటాల కుటుంబం నుంచి వచ్చారని, అందుకే ఆయనకు మేయర్ అభ్యర్థిగా అవకాశం కల్పించామని తెలిపారు.

మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి భారీ మెజార్టీతో అజేష్ యాదవ్‌ను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే పట్టణాభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. వైసీపీకి ఓటు వేయడం వృథా ప్రయాసేనని విమర్శించారు.అనంతపురం అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థిని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలు 2024 ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలను అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి మార్క్ దాడులు, అరాచకాలకు అనంతపురంలో చోటు లేదని వ్యాఖ్యానించారు.ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉపేక్షించరని హెచ్చరించారు.

ఇక మేయర్ అభ్యర్థి అజేష్ యాదవ్ మాట్లాడుతూ.. తనకు అవకాశం కల్పించిన కూటమి పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి పార్టీల మధ్య విభేదాలు ఉన్నాయంటూ వైసీపీ వర్గాలు చేస్తున్న ప్రచారానికి ఈ భారీ ర్యాలీ సమాధానమని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి, సమష్టి కృషితో అనంతపురం మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

మొత్తంగా.. అజేష్ యాదవ్ నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన కూటమి శ్రేణులు నగర రాజకీయాల్లో ఎన్నికల వేడిని మరింత పెంచాయి. మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కూటమి నేతలు ఐక్యంగా ప్రచార బరిలోకి దిగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM