Anantapur: గుమ్మగట్ట KGBV ఘటన అసలు దోషులపై చర్యలు తీసుకోవాలి

Anantapur: అనంతపురం జిల్లా గుమ్మగట్ట కేజీబీవీ ఫుడ్ పాయిజన్ ఘటనలో నాసిరకం సరుకుల ఏజెన్సీలపై చర్యలు తీసుకుని, ఉద్యోగుల టెర్మినేషన్ ఉపసంహరించాలని జేఏసీ డిమాండ్.

M.MITHRAM CHARKRAVARTHY, RAYADURGAM
Published on: 24 Nov 2026 4:09 PM IST
Anantapur
X

Anantapur: గుమ్మగట్ట KGBV ఘటన అసలు దోషులపై చర్యలు తీసుకోవాలి

అనంతపురం: అనంతపురం జిల్లా గుమ్మగట్ట కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో 59 మంది విద్యార్థినులు ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురికావడం తీవ్ర ఆందోళనకరం. విద్యార్థినుల ఆరోగ్యం, భద్రత విషయంలో ప్రభుత్వం అత్యంత బాధ్యతతో వ్యవహరించాలి. అయితే ఈ ఘటనకు గల అసలు కారణాలను నిష్పక్షపాతంగా గుర్తించకుండా ప్రిన్సిపాల్ షబానా బేగంతో పాటు ఇతర కాంట్రాక్టు సిబ్బందిపై టెర్మినేషన్ చర్యలు తీసుకోవడం పూర్తిగా అన్యాయం.

కేజీబీవీలకు ఆహార సరుకుల కొనుగోలు, సరఫరా, నాణ్యత తనిఖీ, నిల్వ, పంపిణీ బాధ్యతలు నిర్వహిస్తున్న ఏజెన్సీల పనితీరుతో పాటు వాటిని పర్యవేక్షించాల్సిన అధికారుల పాత్రపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలోనే ఆహార సరుకుల నాణ్యతపై ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఎందుకు తగిన చర్యలు తీసుకోలేదు?

అక్టోబర్ 28వ తేదీన కేజీబీవీల్లో సరఫరా అవుతున్న ఆహార సరుకుల నాణ్యత, ఇతర సమస్యలపై ఎస్‌ఓలు ఏపీసీకి వినతిపత్రం సమర్పించారు. అధికారుల సమక్షంలోనే ఉప్మా రవ్వలో పురుగులు కనిపించాయనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. అయినప్పటికీ సరఫరా వ్యవస్థలో లోపాలను సరిదిద్దడంలో ఎందుకు జాప్యం జరిగింది? నాణ్యత లేని సరుకులు సరఫరా చేసిన ఏజెన్సీలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?

గుమ్మగట్ట కేజీబీవీలో గత మూడు సంవత్సరాలుగా ANM లేకపోవడం, అకౌంటెంట్, PET పోస్టులు ఖాళీగా ఉండటం, సుమారు 280 మంది విద్యార్థినులకు అవసరమైన నలుగురు వంట సిబ్బందికి బదులుగా ఇద్దరితోనే వంట నిర్వహించడం వంటి సమస్యలను పలుమార్లు జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదు.

రాష్ట్రస్థాయిలో ఉత్తమ కేజీబీవీగా గుర్తింపు పొంది అవార్డులు అందుకున్న గుమ్మగట్ట పాఠశాలలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరం. ఫుడ్ పాయిజన్ ఘటనకు అసలు కారణం ఆహార సరుకుల నాణ్యతలో లోపమా? ఏజెన్సీల నిర్లక్ష్యమా? అధికారుల పర్యవేక్షణ వైఫల్యమా? అనే అంశాలపై ఫుడ్ కమిషన్ లేదా సంబంధిత విచారణ సంస్థ సమగ్ర నివేదిక వెలువరించకముందే ప్రిన్సిపాల్ షబానా బేగంతో పాటు ఇతర సిబ్బందిపై టెర్మినేషన్ చర్యలు తీసుకోవడం సమంజసం కాదు.

ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేస్తున్న అధికారుల చర్యలు ఆపాలి!

రాష్ట్రవ్యాప్తంగా కేజీబీవీ ఉద్యోగులను సెలవుల సమయంలో కూడా తనిఖీల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తూ, భయభ్రాంతులకు గురిచేసే విధంగా అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకరం. ఇప్పటికే అరడజన్లకు పైగా ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం, వరుసగా నోటీసులు ఇచ్చి ఉద్యోగులపై ఒత్తిడి తీసుకురావడం ఎంతవరకు సమంజసం?

మరోవైపు, ఇప్పటికే టెర్మినేషన్ ఉత్తర్వులు పొందిన ఉద్యోగులకు సైతం మళ్లీ షోకాజ్ నోటీసులు జారీ చేయడం అధికారుల పరిపాలనా విధానంపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఒకవైపు టెర్మినేషన్ చేస్తూ, మరోవైపు మళ్లీ షోకాజ్ నోటీసులు ఇవ్వడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? అసలు ఏ నిబంధనల ప్రకారం ఈ చర్యలు తీసుకుంటున్నారు? ఉద్యోగులకు తమ వివరణ ఇచ్చుకునే న్యాయమైన అవకాశం కల్పిస్తున్నారా?

కేజీబీవీల్లో మౌలిక సదుపాయాల కొరత, ఖాళీ పోస్టులు, వంట సిబ్బంది కొరత, నాసిరకం సరుకుల సరఫరా వంటి సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు, ఆ సమస్యలను ఎదుర్కొంటూ పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులపైనే వరుస నోటీసులు, టెర్మినేషన్లకు పాల్పడటం తీవ్రంగా ఖండించదగినది.

పరిపాలన అంటే ఉద్యోగులను భయపెట్టడం కాదు. సమస్యలను పరిష్కరించి విద్యార్థినులకు మెరుగైన విద్య, నాణ్యమైన ఆహారం, సురక్షిత వాతావరణం కల్పించడం. ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు స్వస్తి చెప్పి, పారదర్శకమైన విచారణ చేపట్టాలని

AP SSA & KGBV Forum JAC డిమాండ్ చేస్తోంది.

AP SSA & KGBV Forum JAC ప్రధాన డిమాండ్లు

1. గుమ్మగట్ట KGBV ఫుడ్ పాయిజన్ ఘటనపై నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరపాలి.

2. ప్రిన్సిపాల్ షబానా బేగంతో పాటు ఇతర సిబ్బందిపై విధించిన టెర్మినేషన్ ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలి.

3. నాణ్యత లేని ఆహార సరుకులు సరఫరా చేసిన ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి.

4. సరుకుల కొనుగోలు, నాణ్యత తనిఖీ, సరఫరా, నిల్వ, పంపిణీ వ్యవస్థలో బాధ్యత వహించిన అధికారుల పాత్రను విచారణ పరిధిలోకి తీసుకురావాలి.

5. అక్టోబర్ 28న ఎస్‌ఓలు సమర్పించిన వినతిపత్రంపై అధికారులు తీసుకున్న చర్యల వివరాలను వెల్లడించాలి.

6. రాష్ట్రంలోని అన్ని KGBVల్లో ఆహార సరుకుల నాణ్యతను తనిఖీ చేసి పారదర్శక సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయాలి.

7. ఖాళీగా ఉన్న ANM, అకౌంటెంట్, PET పోస్టులను భర్తీ చేసి, విద్యార్థినుల సంఖ్యకు అనుగుణంగా అవసరమైన వంట సిబ్బందిని నియమించాలి.

8. సెలవుల సమయంలో తనిఖీల పేరుతో ఉద్యోగులను వేధించడం, భయభ్రాంతులకు గురిచేయడం ఆపాలి.

9. అక్రమంగా లేదా ఏకపక్షంగా జారీ చేసిన షోకాజ్ నోటీసులు, టెర్మినేషన్ ఉత్తర్వులను సమీక్షించి ఉపసంహరించుకోవాలి.

10. ఇప్పటికే టెర్మినేషన్ చేసిన ఉద్యోగులకు మళ్లీ షోకాజ్ నోటీసులు జారీ చేయడంపై స్పష్టత ఇవ్వాలి.

11. ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకునే ముందైనా నిబంధనల ప్రకారం విచారణ జరిపి, వారి వివరణకు న్యాయమైన అవకాశం కల్పించాలి.

12. విచారణలో బాధ్యులుగా తేలిన ఏజెన్సీలు, అధికారులపై వారి హోదాతో సంబంధం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలి.

ఉద్యమ హెచ్చరిక

విద్యార్థినులకు నాణ్యమైన ఆహారం అందించడం ప్రభుత్వ బాధ్యత. ఆహార సరుకులు సరఫరా చేసే ఏజెన్సీల నుంచి పర్యవేక్షణ బాధ్యత వహించే ఉన్నతాధికారుల వరకు ప్రతి ఒక్కరి జవాబుదారీతనాన్ని నిర్ధారించాలి.

మూడు సంవత్సరాలుగా కేజీబీవీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించకుండా, ఇప్పుడు జరిగిన ఘటనకు కేవలం కింది స్థాయి కాంట్రాక్టు ఉద్యోగులను బాధ్యులుగా చేయడం తగదు. అసలైన కారణాలను వెలికితీయకుండా ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం ద్వారా సమస్య పరిష్కారం కాదు.

ప్రిన్సిపాల్ షబానా బేగంతో పాటు ఇతర సిబ్బందిపై విధించిన టెర్మినేషన్ ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసే విధంగా జారీ చేస్తున్న షోకాజ్ నోటీసులను నిలిపివేయాలి. నాణ్యత లేని సరుకులు సరఫరా చేసిన ఏజెన్సీలు, పర్యవేక్షణలో విఫలమైన అధికారులపై చర్యలు తీసుకోవాలి.

లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా కేజీబీవీ ఉద్యోగులను సమీకరించి జిల్లా ప్రాజెక్టు కార్యాలయం ఎదుట భారీ ధర్నా, శాంతియుత నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.

అసలైన దోషులను వదిలేసి చిరు ఉద్యోగులను బలిచేయడం మానుకోవాలి. ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు, బాధ్యులైన ఏజెన్సీలు మరియు అధికారులపై చర్యలు తీసుకునే వరకు మా పోరాటం ఆగదు. ఇది ఉద్యోగుల హక్కుల కోసం, విద్యార్థినుల భద్రత కోసం చేస్తున్న ప్రజాస్వామ్య పోరాటం.

M.MITHRAM CHARKRAVARTHY, RAYADURGAM

M.MITHRAM CHARKRAVARTHY, RAYADURGAM