Kalyandurg: కళ్యాణదుర్గంలో టీడీపీ భారీ విజయోత్సవ ర్యాలీ!
Kalyandurg: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి విజయాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ విజయోత్సవ ర్యాలీ జరిగింది.
Kalyandurg: కళ్యాణదుర్గంలో టీడీపీ భారీ విజయోత్సవ ర్యాలీ!
కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి సాధించిన విజయాన్ని పురస్కరించుకుని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించాయి. వాల్మీకి సర్కిల్ నుంచి వైఎస్సార్ పార్క్ వరకు సాగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పసుపు జెండాలు రెపరెపలాడగా జై చంద్రన్న.. జై సురేంద్ర అన్న నినాదాలతో పట్టణం మార్మోగింది. ర్యాలీలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు, మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో పసుపు జెండా రెపరెపలాడిందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు, ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు చాలా తేడా ఉందని పేర్కొన్నారు. గతంలో వైసీపీ మాదిరిగా తాము కూడా దౌర్జన్యాలకు పాల్పడి ఉంటే ఆ పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చేది కాదని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సొంత నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని ప్రశంసించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్‌కు ఒక రెక్క, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మరో రెండు రెక్కలు విరిగాయని ఎద్దేవా చేశారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లోనూ ఫ్యాన్ రెక్కలు విరగ్గొట్టి అన్ని పంచాయతీల్లో టీడీపీ మద్దతుదారులను గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించిందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కూటమికి పట్టం కట్టారని పేర్కొన్నారు. నారా లోకేష్ నాయకత్వంలో మరో 20 ఏళ్ల పాటు కూటమికి తిరుగుండదని ధీమా వ్యక్తం చేశారు. 2029లోనూ కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా అమిలినేని సురేంద్రబాబే విజయం సాధిస్తారని అన్నారు. వైసీపీలో అంతర్గత విభేదాలు ఉన్నాయని, ఆ పార్టీ నేతలు మూడు ముక్కలాట ఆడుతున్నారని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లోనూ ఫ్యాన్ రెక్కలు విరగ్గొట్టి టీడీపీ మద్దతుదారులను గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి ఎన్నికల సమయంలో ధర్మతేజ, అవినాష్ గురించి ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు. పోలింగ్ కేంద్రాల వద్ద వెంకటరామిరెడ్డి సోదరులు ఉన్నప్పుడు తన మనుషులు ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. తమ బృందం రాజకీయాల కంటే ప్రజల అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లు ముందుకు రాకపోయినా అనంతపురం టవర్ క్లాక్ బ్రిడ్జి పనులను ఎస్ఆర్సీ కంపెనీ ద్వారా సకాలంలో పూర్తి చేశామని తెలిపారు. చాపిరి చెరువుకు నీళ్లు తీసుకొచ్చిన ఘనత తనదేనని పేర్కొన్నారు. విద్యార్థులకు 7,300 సైకిళ్లు పంపిణీ చేశామని వెల్లడించారు. పాఠశాలలు, దేవాలయాలు, బోర్వెల్లకు తన సొంత నిధులతో సహాయం అందిస్తున్నానని తెలిపారు.
బీటీపీ పనులు వేగంగా జరుగుతున్నాయని, 2028 మార్చి నాటికి పనులు పూర్తి చేసి రెండు నియోజకవర్గాలకు నీరందిస్తామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు హామీ ఇచ్చారు. తనకు తలారి రంగయ్యతో ఎలాంటి పోటీ లేదని, తన దృష్టంతా నియోజకవర్గ అభివృద్ధిపైనే ఉందని స్పష్టం చేశారు. తాను కానీ, తన కంపెనీ కానీ ఎలాంటి అక్రమాలకు, ఆక్రమణలకు పాల్పడటం లేదని, ప్రజలకు సహాయం చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లోనూ టీడీపీ విజయపరంపర కొనసాగించేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.




